ఉగాది ఒక్కటే.. పంచాంగాలే వేర్వేరు.. మూడు పార్టీలదీ తలో దారి

by Dishafeatures2 |
ఉగాది ఒక్కటే.. పంచాంగాలే వేర్వేరు.. మూడు పార్టీలదీ తలో దారి
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రజలందరికీ ఉగాది పండుగ ఒకేలా ఉంటున్నా ఆయా పార్టీలు నిర్వహించిన వేడుకల్లో పంచాంగ పఠనం మాత్రం వేర్వేరు రకాలుగా ఉంది. ఏ పార్టీ తరఫున పంచాంగ పఠనం జరిగితే అయ్యవారు ఆ పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యానాలు చేశారు. ఇదే ఇప్పుడు పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా పంచాంగ పఠనం కార్యక్రమాలను ఏర్పాటు చేశాయి.ముందున్న కాలమంతా అనుకూలమేనంటూ అన్ని పార్టీలకూ అయ్యవార్లు సెలవిచ్చారు.

రాశులు, గ్రహబలాలు రాష్ట్రమంతా ఒకే తీరులో ఉన్నా అయ్యవార్లు వేర్వేరు వ్యాఖ్యానాలు చేయడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకూ ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది, దేనికి ప్రతికూలంగా ఉంటుంది, అయ్యవార్లు చెప్పిన వ్యాఖ్యానాల్లో నిజమెంత అనే గుసగుసలు మొదలయ్యాయి. ఒక దశలో మీడియా గురించి కూడా "ఇకపైన వార్తలకు వెతుకులాట అవసరం లేదు. కడుపు నిండా వార్తలు వస్తాయి.." అంటూ ఒక అయ్యవారు చెప్పడంపై సెటైర్లు కూడా వెల్లువెత్తాయి.

ప్రగతి భవన్ వేదికగా జరిగిన పంచాంగ పఠనంలో టీఆర్ఎస్ పార్టీకి ఈ ఏడాది నుంచి మంచి కాలమే ఉంటుందని, కేసీఆర్ గ్రహబలం బాగా ఉందని, దేశం దృష్టంతా ఆయనపైనే ఉంటుందని బాచుపల్లి సంతోష్ కుమార్ శర్మ పేర్కొన్నారు. ఈ ఏడాది సాహసోపేతమైన నిర్ణయాలు ప్రకటిస్తారని తెలిపారు. 75% మంచి ఫలితాలు కనిపిస్తాయని, 25% ప్రతికూల పరిస్థితులు ఉన్నా అధిగమిస్తారని తెలిపారు. కేసీఆర్‌కు గతేడాదికంటే ఈ సంవత్సరం బాగుంటుందని, ప్రత్యర్ధులు ఇబ్బందులు పెట్టినా వారినే ఆక్రమించేస్తారని పేర్కొన్నారు.


యాదాద్రి నర్సింహుడికి త్రినేత్రం ఉన్నట్లుగానే కేసీఆర్ కూడా తన మూడో కంటితో పార్టీల నేతల కదలికలను గమనిస్తూ ఉన్నారని, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు.. ఇలాంటివన్నీ గ్రహిస్తూ ఉంటారని వ్యాఖ్యానించారు. పంచాంగంలో రాజకీయ అంశాలనూ బాచుపల్లి శర్మ ప్రస్తావించడంపై చర్చలు జోరందుకున్నాయి. ఇక గాంధీ భవన్ వేదికగా జరిగిన పంచాంగ పఠనంలో భిన్నమైన అంశాలను అయ్యవారు శ్రీనివాసమూర్తి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు నిరంకుశ పాలనతో ప్రజాగ్రహాన్ని చవిచూస్తాయని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల హక్కులను కాల రాస్తోందని, అక్టోబర్‌ నుంచి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తారని వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఓ నాయకుడి మరణ వార్త యావత్ దేశానికి దిగ్భ్రాంతి కలిగిస్తుందన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటాయని, ముఖ్యంగా అక్టోబరు తర్వాత అంతా మంచి కాలమేనని సెలవిచ్చారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో అక్టోబరు నుంచి కాంగ్రెస్‌ పార్టీకి కలిసొచ్చే కాలమంటూ శ్రీనివాసమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం.

మరోవైపు బీజేపీ కార్యాలయంలో జరిగిన పంచాంగ పఠనం ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం మీదనే ఫోకస్ అయింది. రాష్ట్రంలో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చని, కానీ కేంద్రంలో మాత్రం మూడోసారి మోడీ ప్రధాని అవుతారని, 2028 సంవత్సరం మే నెల వరకు ఆయన ఢోకా లేదని అయ్యవారు ఎర్రబెల్లి మహేశ్వర శర్మ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వం దీటుగానే బదులిస్తున్నదని తెలిపారు. ఆహార ధాన్యాలకు రానున్న కాలంలో ఎలాంటి లోటు ఉండదని, కానీ వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయం, ఖర్చు సమానంగానే ఉంటాయని, మూడేళ్ళుగా ఉన్నట్లే ఇకపైన కూడా రాజకీయ పరిస్థితులు కొనసాగుతాయన్నారు.

రాష్ట్రానికి సమకూరే ఆదాయం కొందరి చేతుల్లోనే తిరుగుతుందని, యావన్మంది ప్రజలకు ఆ భాగ్యం ఉండకపోవచ్చని మహేశ్వర శర్మ వెల్లడించారు. మూడు పార్టీల పంచాంగ పఠనాల్లో పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యానాలను అయ్యవార్లు ప్రస్తావించడంతో ఏది నిజమో తెలియక రాజకీయ నాయకులు గందరగోళంలో పడ్డారు. ఈ పంచాంగ పఠనాలన్నీ దాదాపుగా స్టేజ్ మేనేజ్డ్ తరహాలోనే జరగడంతో నొప్పింపక.. తానొవ్వక అనే తీరులో మాత్రమే కాక పార్టీలకు ఉత్సాహం కలిగించేలా, నేతలను ప్రసన్నం చేసుకునే తీరులో ఉండడం విశేషం.

Next Story