తమ్ముడితో గొడవ.. ఐదేళ్లుగా ఇంటిముఖం చూడని మాజీ సీఎం!

by Disha Web Desk 2 |
తమ్ముడితో గొడవ.. ఐదేళ్లుగా ఇంటిముఖం చూడని మాజీ సీఎం!
X

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయ పార్టీ నేతల్లో అంతర్గత విభేదాలు ఉండటం సర్వసాధారణం. గ్రామస్థాయి నాయకుల నుంచి జాతీయ స్థాయి నాయకుల వరకు అందరిలోనూ రాజకీయ విభేదాలు ఉంటాయి. అంతెందుకు ఒకే పార్టీలో కొనసాగుతున్న ఇద్దరు సొంత అన్నదమ్ముల్లోనూ అంతర్గతంగా రాజకీయ గొడవలు ఉంటాయి. తాజాగా.. ఇలాంటి పంచాయతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని కుదిపేస్తున్నది. నల్లారి కుటుంబంలో రాజకీయం వేడెక్కింది. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన సోదరుడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డిల మధ్య పొలిటికల్ వార్ జరుగున్నట్లు సమాచారం. రోశయ్య తర్వాత ఏపీకి ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి 'సమైక్య ఆంధ్రప్రదేశ్ పార్టీ'ని స్థాపించారు. అనంతరం కొంతకాలం తర్వాత తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ నేపథ్యంలోనే కిరణ్ కుమార్ సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

2017లో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరారు. అయితే, ఫ్యామిలీకి వ్యతిరేకంగా కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరడం కిరణ్ కుమార్ రెడ్డికి ఇష్టం లేదు. ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో.. ఏపీ రాజకీయాల్లో కిషోర్ కుమార్ రెడ్డి యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి తరచూ చిత్తూరు జిల్లాకు రాకపోకలు సాగిస్తున్నా.. కలికిరి మండలంలోని సొంతూరైన నగరిపల్లికి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. తన తమ్ముడు నల్లారి కిశోర్ ఆ ఇంటి నుంచే తన కార్యకలాపాలు కొనసాగిస్తుండటంతో కాంగ్రెస్ కండువా వేసుకున్న తాను.. పసుపు జెండా పట్టుకున్న తమ్ముడి ఇంటికి వెళ్లడానికి ఇష్టపడటం లేదని సమాచారం. తమ్ముడు కిశోర్ తీరు వల్లే కిరణ్ కుమార్ రెడ్డి ఐదేళ్లుగా సొంతూరి ముఖం చూడలేకపోతున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. అంతేగాక, అన్నదమ్ముల మధ్య ఏకాభిప్రాయం లేక కుటుంబంలోనూ చీలిక వచ్చిందని సమాచారం. మరి ఈ వివాదం ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి.



Next Story

Most Viewed