రొమాన్స్ అంటే అందరికీ తెలుసు.. మరి, బ్రొమాన్స్.. ఉమాన్స్... అంటే ?

by Dishanational1 |
రొమాన్స్ అంటే అందరికీ తెలుసు.. మరి, బ్రొమాన్స్.. ఉమాన్స్... అంటే ?
X

దిశ, ఫీచర్స్: స్త్రీ పురుషుల స్నేహాన్ని అడుగడుగునా అనుమానించే సమాజంలో స్వచ్ఛమైన మైత్రిని ప్రతిబింబిస్తోంది 'ప్లాటోనిక్ ఫ్రెండ్‌షిప్'. ఈ బంధంలో లింగభేదాలతో సంబంధం ఉండదు. ఇష్టాలు, అభిప్రాయాలు, మరెన్నో అంశాల ఆధారంగానే ఒకరికొకరు ఆకర్షితులవుతారు. కానీ ఎప్పుడూ, ఏ విషయంలోనూ హద్దులు దాటరు. ఒక్కమాటలో చెప్పాలంటే.. డేటింగ్ లేదా సెక్స్ చేయని ఇద్దరు వ్యక్తుల మధ్య సన్నిహిత స్నేహంగా దీన్ని అభివర్ణించవచ్చు. కుటుంబ సభ్యులను ప్రేమిస్తున్నట్లుగానే ప్లాటోనిక్ ఫ్రెండ్‌నూ ప్రేమిస్తారు. ఈ మైత్రిబంధంలో భేదాభిప్రాయాలున్నా.. ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువనిస్తారు. సలహాలు ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు ఏ సందర్భంలోనూ ఎదుటి వ్యక్తిపై ఎలాంటి ఒత్తిడి కలిగించరు. ఏ పరిస్థితుల్లోనైనా ఒకరికొకరుగా అండగా నిలుస్తూ కుటుంబానికి మించి దగ్గరవుతారు. అయితే 'ప్లాటోనిక్ ఫ్రెండ్‌షిప్' వల్ల కలిగే అనర్థాలు ఏమిటి? ప్రయోజనాలు ఏమిటి?

కాలానుగుణంగా సంబంధాలు మారతాయి లేదా బలపడతాయి. కానీ 'స్నేహబంధం' ఒక్కటే చివరి శ్వాస వరకు కొనసాగుతుంది. ఇక 'ఫ్రెండ్‌షిప్‌'లో రహస్యాలకు తావుండదు గనుక ఆ స్వచ్ఛతే ఇరువురి మైత్రి బంధాన్ని కాపాడుతుంది. 'ప్లాటోనిక్ ఫ్రెండ్‌షిప్'‌లోనూ అంతే గాఢత, అదే ప్రేమ ఉంటుంది కానీ సమాజం ఈ తరహా స్నేహానికి తగినంత విలువ ఇవ్వదు. అయితే 'ప్లాటోనిక్'‌లో వ్యక్తులు లోతైన అనుబంధాన్ని అనుభవిస్తారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రత్యేకమైన భావోద్వేగ, ఆధ్యాత్మిక సంబంధం కొనసాగుతుంది. కలిసున్నా, విడివిడిగా ఉన్నా హద్దులు మీటరు. కలిసే సినిమాలు, షికార్లు చేస్తారు. ఒకే రకమైన పాటల్ని ఇష్టపడటంతో పాటు ఒకే విధమైన అభిరుచులు కలిగి ఉంటారు. వంటచేయడంలోనే కాదు ప్రతీ పనిలోనూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. ఈ తరహా స్నేహాన్ని టాలీవుడ్ ఫిల్మ్ 'ఓ మై ఫ్రెండ్' చిత్రం అద్భుతంగా ఆవిష్కరించింది.

సవాళ్లు

ప్లాటోనిక్‌లో నిత్యం సవాళ్లు ఎదురవుతుంటాయి. ఇంటి సభ్యుల నుంచి చుట్టుపక్కల వ్యక్తుల వరకు చాలామంది స్త్రీ-పురుషుల స్నేహాన్ని ప్రశ్నిస్తుంటారు. తప్పుగా అర్థం చేసుకుని 'పెళ్లి' చేసుకోమంటూ సలహా ఇస్తుంటారు. ఒకవేళ వేరే వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్నా.. వీరి సన్నిహిత సంబంధాన్ని చూసి పార్ట్‌నర్స్ కూడా అసూయపడుతుంటారు. ఉదాహరణకు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన భర్త/భార్య తన ప్లాటోనిక్ ఫ్రెండ్(మహిళ/పురుషుడు)తో గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుతూ.. ఆ సంభాషణల్లో ఆనందాన్ని పొందుతుంటే సదరు పార్ట్‌నర్‌కు కష్టంగా ఉంటుంది కదా. అంతేకాదు భర్త/భార్య స్వచ్ఛమైన ఉద్దేశాలు కలిగి ఉన్నప్పటికీ వారి స్నేహం ఏదో ఒక రోజు మరింతగా హద్దులు మీరుతుందనే భయం వారిని వెంటాడుతుంది. అందువల్ల జీవిత భాగస్వాములకు మీ స్నేహబంధం గురించి వివరంగా చెప్పడం వల్ల వారికి స్పష్టత కలిగి మనసులో ఉన్న అనుమానాలు తొలగిపోయే అవకాశముంటుంది.

ప్రయోజనాలు

మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ప్లాటోనిక్ సంబంధాలు కీలక పాత్ర పోషిస్తాయని ఓ పరిశోధన వెల్లడించింది. మనం చేసే ఏ పనిలో అయినా ఒకరి మద్దతు, ప్రోత్సాహం లభిస్తే నిరాశ, ఆందోళన దరిచేరవని పేర్కొంది. అంతేకాదు ప్లాటోనిక్ పార్ట్‌నర్ తోడుగా ఉంటే ఎంత పెద్ద సవాళ్లనయినా ఫేస్ చేసే ధైర్యం సొంతమవుతుంది. ఈ మేరకు మన వెంట ఒకరున్నారనే ధైర్యం ఒత్తిడిని దూరం చేసి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

1800ల చివరి నాటికి అమెరికా, బ్రిటన్ దేశాల్లోని మధ్యతరగతి మహిళలు కూడా వర్క్‌ఫోర్స్‌లోకి ప్రవేశించారు. దీంతో అప్పటివరకు పురుషులపై ఆధారపడ్డ మహిళలంతా స్వతంత్రంగా ఇతర మహిళలతో కలిసి జీవించేందుకు మొగ్గుచూపారు. ఇలా 'దీర్ఘకాలిక, నిబద్ధతతో కలిసి జీవించే ఇద్దరు మహిళల' సంబంధాన్ని 'బోస్టన్ మ్యారేజ్'గా అభివర్ణించారు. ఈ క్రమంలో 19, 20వ శతాబ్దం నాటికి చాలామంది సంపన్న మహిళలు సాంప్రదాయ వివాహాన్ని విడిచిపెట్టి కలిసి ఉండేందుకు ఇష్టపడ్డారు. కాగా బోస్టన్ వివాహాల్లో లెస్పియన్ సంబంధాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అయితే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఒకరికొకరు అండగా ఉంటూ పరస్పర గౌరవం, మద్దతు ఇచ్చిపుచ్చుకుంటున్న పీఎల్‌పీ (primary-partner relationships) బంధాల వైపు ఈతరం ఎక్కువగా ఆకర్షితమవుతోంది.

ప్లాటోనిక్ సంబంధాలు మూడు రకాలు

బ్రొమాన్స్: ఇది ఇద్దరు పురుషుల మధ్య సన్నిహిత, ఆప్యాయత, లైంగికేతర సంబంధాన్ని వివరించడానికి ఉపయోగించే పదం.

ఉమాన్స్ : ఈ పదం ఇద్దరు మహిళల మధ్య భావోద్వేగ, లైంగిక, శృంగార బంధాన్ని వివరించడానికి ఉపయోగిస్తారు.

వర్క్ స్పౌజ్: ఈ పదబంధాన్ని కొన్నిసార్లు సహోద్యోగుల మధ్య సన్నిహిత బంధాన్ని వివరించడానికి ఉపయోగిస్తారు.

కొన్ని సందర్భాల్లో ప్లాటోనిక్ స్నేహితులే జీవితాంతం ఒకరికొకరై జీవిస్తుంటారు. కానీ ఎలాంటి లైంగిక సంబంధాన్ని ఏర్పరుచుకోరు.



Next Story

Most Viewed