డబ్బులు ఇస్తే కాలేజీకి రాకపోయినా పాస్ చేస్తాం..

by Web Desk |
డబ్బులు ఇస్తే కాలేజీకి రాకపోయినా పాస్ చేస్తాం..
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని లింగోటం గ్రామంలోని వీఎల్ఆర్ఎం ఐటిఐ కళాశాల యాజమాన్యం ప్రతి విద్యార్థి వద్ద రూ.40 వేల రూపాయలు వసూలు చేసి కళాశాలకు రావాల్సిన అవసరం లేదు.. పరీక్షల సమయంలో తప్పక ఉత్తీర్ణత చేస్తామని నమ్మబలికి పరీక్షల్లో ఫెయిల్ చేశారని విద్యార్థులు ఆరోపించారు. ఈ మేరకు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద విద్యార్థులు సోమవారం రాస్తారోకో చేశారు. వారికి ఎన్ఎస్ యూఐ నాయకులు మద్దతు తెలుపుతూ కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ.. కళాశాలకు రావాల్సిన అవసరం లేదని చెప్పి ఫెయిల్ చేశారని అన్నారు. ఈ విషయం పై ప్రిన్సిపాల్ నిశాంత్ ను అడగగా విద్యార్థులపై దురుసుగా ప్రవర్తిస్తూ దౌర్జన్యం చేశాడని ఆరోపించారు. కళాశాలలో 120 మంది విద్యార్థులు ఆన్‌లైన్ పరీక్షలు రాస్తే అందులో 25 మంది మాత్రమే ఉత్తీర్ణులు అయ్యారని తెలిపారు. ఆ కొంత మంది విద్యార్థులు పరీక్ష రాశారని, మిగతా విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదని ప్రిన్సిపాల్ అనడంతో అతన్ని అడిగేందుకు వెళ్ళాం.. ఆయన అసభ్యకరంగా మాట్లాడాడని అందుకే ఈ ధర్నా చేస్తున్నామని విద్యార్థులు తెలిపారు.

అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని కళాశాల యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల వద్దకు అచ్చంపేట ఎస్ఐ వచ్చి కళాశాల యాజమాన్యం తో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. తదుపరి కాలేజీ యాజమాన్యం 10 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని మాట ఇచ్చింది.



Next Story

Most Viewed