అందరి ముందే యథేచ్ఛగా ఆ పని.. చివరకు చెరువును కూడా వదలట్లే..

by Dishafeatures2 |
అందరి ముందే యథేచ్ఛగా ఆ పని.. చివరకు చెరువును కూడా వదలట్లే..
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్ : హ‌య‌త్‌న‌గ‌ర్ మండ‌ల ప‌రిధిలోని బాతుల చెరువును క‌బ్జాదారులు ఆక్రమించారు. ఈ క‌బ్జారాయుళ్లు కాల్వలను కూడా వ‌ద‌ల‌డం లేదు. కాల్వలను య‌థేచ్చ‌గా పూడ్చి.. అధికారుల‌కు స‌వాల్ విసురుతున్నారు. ఇంజార్‌పూర్ జిలాన్‌ఖాన్ చెరువు నుండి బాతుల చెరువు నాలాను పూర్తిగా క‌బ్జా చేశారు. బాతుల చెరువులో క‌లిసే నాలాల క‌బ్జాల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. అడ్డుకోవాల్సిన అధికారులు అందిన కాడికి దండుకుంటున్నారు. ర‌క్షించాల్సిన ప్ర‌జా ప్ర‌తినిధులు అక్ర‌మార్కులకు అండ‌గా నిలుస్తున్నారు. రెవెన్యూ, నీటి పారుద‌ల శాఖ‌, మున్సిప‌ల్ అధికారులు కాసుల క‌క్కుర్తితో అటువైపు క‌న్నెత్తి కూడా చూడ‌డం లేదు. ఫ‌లితంగా వేల కోట్ల రూపాయలు కొల్ల‌గొట్టేందుకు భూబ‌కాసురులు రంగం సిద్ధం చేసుకున్నారు.


యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాలు కబ్జా..

హ‌య‌త్‌న‌గ‌ర్ మండ‌ల ప‌రిధిలోని ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను అక్ర‌మార్కులు య‌థేచ్ఛ‌గా ఆక్ర‌మించేస్తున్నారు. ఈ ప్రాంతంలో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుండ‌గా అందివ‌చ్చిన అవ‌కాశాన్ని అనుకూలంగా మ‌లుచుకుంటూ అక్ర‌మార్కులు చెల‌రేగిపోతున్నారు. చెరువు, నాలా, ప్ర‌భుత్వ స్థ‌లం, పార్క్ అన్న తేడా లేకుండా బ‌రితెగించి మ‌రీ క‌బ్జాల‌తో మాయం చేస్తున్నారు. కొనే అవ‌స‌రం లేకుండానే అప్ప‌నంగా ప్ర‌భుత్వ భూమి ల‌భిస్తుండ‌డంతో..అధికారులకు అడిగినంత ముట్ట‌జెప్పి, అక్ర నిర్మాణాల‌కు తెగ‌బ‌డుతున్నారు.

క‌న్నీరు పెడుతున్న బాతుల చెరువు..?

ఏళ్ల త‌ర‌బ‌డి హ‌య‌త్‌న‌గ‌ర్ ప్రాంత వాసుల‌కు చెరువుగా ఉన్న బాతుల చెరువు ప్ర‌స్తుతం క‌బ్జాదారుల చెర‌లో చిక్కి క‌న్నీరు పెడుతోంది. ఇప్ప‌టికే చెరువును క‌బ్జా చేసిన అక్ర‌మార్కులు కాలువ‌ల‌ను వ‌ద‌ల‌డం లేదు. ప్ర‌జ‌ల‌కు సాగు, తాగు నీరందించేందుకు నాటి నిజాం న‌వాబులు గొలుసుక‌ట్టు చెరువుల‌ను నిర్మించారు. ఒక చెరువు నిండితే మ‌రో చెరువులోకి నీరు చేరు విధంగా కాలువ‌లు ఏర్పాటు చేశారు. ఇప్ప‌ుడు ఆ కాలువ‌లు క‌నుమ‌రుగ‌య్యాయి. తుర్కయంజాల్‌లోని మాస‌బ్ చెరువు నిండితే అలుగు వెంబండి కింద ఉన్న ఇంజాపూర్ జిలాన్‌ఖాన్ చెరువు నిండేందుకు కాలువ‌ను ఏర్పాటు చేశారు.


జిలాన్‌ఖాన్ చెరువు నిండితే బాతుల చెరువులోకి నీరు చేరు విధంగా జిలాన్‌ఖాన్ చెరువు నుండి బాతుల చెరువుకు కాలువ ఉంది. ఇప్పుడు ఆ కాలువ క‌నుమ‌రుగ‌య్యింది. అదే విధంగా బాతుల చెరువు నిండితే పెద్ద అంబ‌ర్‌పేట్‌లోని ఈదుల చెరువులోకి నీరు చేరే విధంగా కాలువ‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌స్త‌తం ఈ గొలుసుక‌ట్టు కాలువ‌లను క‌బ్జాదారులు పూర్తిగా మింగేశారు. ఫ‌లితంగా చిన్న‌పాటి వ‌ర్షం ప‌డినా చెరువుల చుట్ట‌ుప‌క్క కాల‌నీలు నీట మునుగుతున్నాయి. దీంతో నానాటికి కుచించుకు పోతున్న బాతుల చెరువు క‌న్నీరు పెడుతోంది.

జిల్లా క‌లెక్ట‌ర్ జోన్యం చేసుకోవాలి

రంగారెడ్డి జిల్లా పాల‌నా వ్య‌వ‌హారాల్లో స‌మ‌ర్థ‌వంత‌మైన అధికారిగా పేరుపొందిన జిల్లా క‌లెక్ట‌ర్ అమయ్‌కుమార్ చెరువు, కాలువ‌ల క‌బ్జాపై దృష్టి సారించాల‌ని ప‌లువురు కోరుతున్నారు. ఇప్ప‌టికే చెరువు క‌బ్జాదారుల చెర‌లో చిక్కుకుంద‌ని, ఇప్ప‌టికే చెరువ‌తో పాటు గొలుసుక‌ట్టు కాలువ‌లు పూర్తిగా క‌బ్జాల‌కు గుర‌య్యాయ‌ని వాపోతున్నారు. గ‌తేడాది కురిసిన వ‌ర్షాల‌తో భారీగా వ‌ర‌ద నీరు చేరి, జ‌నావాసాల‌ను ముంచెత్తింద‌ని, కాలువ‌ల‌ను పూడ్చి నిర్మాణాలు చెప్ప‌డ‌డంతో త‌మ ప‌రిస్థితి ఆగ‌మ్య‌గోచ‌రంగా త‌యారైంద‌ని స్థానికులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా క‌లెక్ట‌ర్ జోన్యం చేసుకుని బాతుల చెరువు, కాలువ‌ల క‌బ్జాల‌ను అరిక‌ట్టాల‌ని కోరుతున్నారు.


Next Story