ప్రభుత్వ ఆదాయానికి అక్రమార్కుల గండి.. యథేచ్చగా దందా..

by Dishafeatures2 |
ప్రభుత్వ ఆదాయానికి అక్రమార్కుల గండి.. యథేచ్చగా దందా..
X

దిశ, లక్షెట్టిపేట : అక్రమ మొరం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు సాగిస్తుండడంతో లక్షల రూపాయల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని మోదెల శివారులో ఉన్న గువ్వల గుట్టను కొందరు అక్రమార్కులు అనుమతులు లేకుండానే తోడేస్తున్నారు. గుట్టనే కాకుండా, దాని పరిసర పట్టా భూముల్లోనూ మొరం తవ్వకాలు చేస్తున్నారు. ఇంత జరుగుతన్నా అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఏం జరుగుతోంది..

రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకోగా ఎక్కడపడితే అక్కడ వెంచర్లు వెలిశాయి. లక్షెట్టిపేట పట్టణ, పరిసర గ్రామాల్లో వెలసిన వెంచర్లకు మొరం అవసరం కావడంతో గువ్వల గుట్టపై అక్రమ వ్యాపారుల కన్ను పడింది. మోదెల శివారులోని గురుకుల పాఠశాలల సముదాయాలు, మోడ్రన్ డిగ్రీ కళాశాల పక్కన ఉన్న గువ్వల గుట్ట సుమారు ఐదెకరాల ప్రభుత్వ స్థలంలో విస్తరించి ఉంది. గుట్టను తోడేస్తూ మొరం తవ్వకాలు చేస్తుండటంతో రాబోయే రోజుల్లో గుట్ట కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతోంది.

అక్రమ వ్యాపారులు జేసీబీ యంత్రాలతో గుట్ట మొరం మట్టిని తోడేస్తూ ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా వెంచర్‌లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్‌లోడ్ మొరం మట్టికి రూ. 500 నుంచి రూ.600 వరకు, దూరం ఎక్కువైతే అదనంగా మరో రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేసుకుంటున్నారు. టిప్పర్‌లోడ్ మొరానికి రూ.2వేల నుంచి రూ. 2500 తీసుకుంటూ లక్ష రూపాయల్లో అక్రమార్జన చేస్తూ మూడు పువ్వులు ఆరు కాయలు గా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గుట్టనే కాకుండా మోదెల శివారులోని ఇతర పట్టా భూముల్లోనూ మొరం తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

నిబంధనలు బేఖాతరు..

ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో మొరం, మట్టి తవ్వకాలు చేపట్టాలంటే మండల రెవెన్యూ, భూగర్భ గనుల శాఖాధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ మేరకు వాల్టా చట్టం ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి తవ్వకాలు చేపట్టాలి.ఆ నిబంధనలను తుంగలో తొక్కుతూ రాజకీయ బడా నాయకుల కనుసన్నల్లోనే అక్రమ వ్యాపారం కొనసాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో అధికారులు సైతం అటువైపుగా కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ మొరం తవ్వకాల విషయమై లక్షెట్టిపేట తహసీల్దార్ జ్యోత్స్నని సంప్రదించగా అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు జరుగుతున్నట్లు తన దృష్టికి రాలేదన్నారు. ఎక్కడైనా అక్రమ తవ్వకాలు జరిగితే చర్యలు చేపడతామని ఆమె అన్నారు.



Next Story

Most Viewed