'క్రిప్టోకరెన్సీ తెచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదు'!

by Disha Web Desk 17 |
క్రిప్టోకరెన్సీ తెచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం నుంచి క్రిప్టోకరెన్సీని తీసుకొచ్చే ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ మంగళవారం తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఉన్న క్రిప్టోకరెన్సీలపై ఎటువంటి నియంత్రణ లేదని రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్‌బీఐ ఎలాంటి క్రిప్టోకరెన్సీని జారీ చేయదని, ఆర్‌బీఐ చట్టం-1994 ప్రకారం సాంప్రదాయ పేపర్ కరెన్సీనే సెంట్రల్ బ్యాంకు జారీ చేస్తోందని ఆయన వివరించారు. దీన్నే రానున్న రోజుల్లో డిజిటల్ రూపంలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)గా తీసుకురానున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ డిజిటల్ కరెన్సీని దశల వారీగా ప్రవేశపెట్టడానికి ఆర్‌బీఐ సిద్ధమవుతోందని, నగదు వాడటాన్ని వీలైనంత తగ్గిస్తూ, తక్కువ లావాదేవీల్లో మాత్రమే నోట్లను వినియోగించే ప్రయోజనాలు దీనివల్ల లభిస్తాయని చెప్పారు.

కాగా, గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం గణాంకాల ప్రకారం మొత్తం రూ. 4,378 కోట్ల విలువైన నోట్లను ముద్రించగా, ప్రస్తుతం ఇది రూ. 4 వేల కోట్లకు తగ్గింది. అలాగే, గత ఆరేళ్లతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో బ్యాంకులు రూ. 7.34 లక్షల కోట్లకు పైగా ఎన్‌పీఏల నుంచి రికవరీ చేశాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ రాజ్యసభలో చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021, డిసెంబర్ 31 నాటికి రూ. 55,895 కోట్లు రికవరీ అయ్యాయని ఆయన పేర్కొన్నారు. 2016లో ఆర్‌బీఐ బ్యాంకుల్లో జరిగే మోసాలపై కీలక ఆదేశాలు జారీ చేసిందని, వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం నిర్మాణాత్మకమైన, విధానపరమైన సంస్కరణలు చేపట్టిందని ఆయన వివరించారు.


Next Story

Most Viewed