విద్యార్థుల సంఖ్య పెంపు బాధ్యత ఉపాధ్యాయులదే: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

by Web Desk |
విద్యార్థుల సంఖ్య పెంపు బాధ్యత ఉపాధ్యాయులదే: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
X

దిశ, ప్రజ్ఞాపూర్: గజ్వేల్ మండలం సింగాటం ఉన్నత పాఠశాలలో క్రీడా విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమం లో గురువారం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుందని, ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చించినా నిరుపయోగమవుతున్నట్లు పేర్కొన్నారు.




స్థానిక పాఠశాలలో 68 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, ఏడుగురు ఉపాధ్యాయులు పని చేస్తుండగా ఒక ఉపాధ్యాయునికి సరాసరి పది మంది పిల్లలు లేరన్నారు. ఇంత ఖర్చు పెట్టి పాఠశాల అభివృద్ధి, ప్రతి నెల ఉపాధ్యాయులకు లక్షల్లో వేతనాలు ఇస్తూ.. మంచి ప్రావీణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య పెరగకుండా ప్రైవేట్ పాఠశాలకు పిల్లలు తరలివెళ్లడం ఎంతవరకు సమంజసమన్నారు. గ్రామంలోని విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు వెళ్లకుండా చూస్తూ తల్లిదండ్రులు, గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు.

ఖాళీలను భర్తీ చేయడంతో పాటు ఆంగ్ల మీడియం బోధన సౌకర్యాలు కూడా సమకూర్చామన్నారు. సింగాటం పాఠశాల నుండి 'మన ఊరు మన బడి' పాఠశాల కార్యక్రమం ప్రారంభం కావాలన్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్ పార్టీ వర్గాలు కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న పనులు ప్రజల మెప్పు పొందాయని వాటిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని ఇందుకు పార్టీ వర్గాలు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ప్రజలతో కలిసి ఉన్నప్పుడే గ్రామంలో నాయకుడిగా గుర్తింపు పొందుతారని సూచించారు. కొత్తగా జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఎంపికైన సందర్భంగా ప్రభాకర్ రెడ్డిని శాలువా కప్పి, బొకే అందించి సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.


Next Story