'నాపై హత్యాయత్నం జరిగింది'.. ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 13 |
నాపై హత్యాయత్నం జరిగింది.. ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎంపీగా ఉన్న తనపైనే కొందరు దుండగులు హత్య చేసేందుకు యత్నించారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ వైఫల్యాల అధ్యయన కమిటీ కన్వీనర్‌గా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం తొలి సమావేశాన్ని ఆయన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంపై వ్యూహరచన చేసినట్లు వెల్లడించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని, మ‌రిన్ని స‌మావేశాలు నిర్వహించి సమస్యలను గుర్తిస్తామన్నారు. గ‌ల్లీ నుంచి రాష్ట్రస్థాయి వ‌ర‌కు సమస్యలను గుర్తించి రాష్ట్ర నాయ‌క‌త్వానికి అంద‌జేస్తామని స్పష్టం చేశారు. ఇకపోతే నిజామాబాద్‌లో గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతోందన్నారు. అక్కడ శాంతి భద్రతలు క్షీణించాయని పేర్కొన్నారు. ఉగ్రవాదుల కార్యకలాపాలు కూడా ఎక్కువయ్యాయని ఆరోపించారు.

నిజామాబాద్ పోలీస్ క‌మిష‌నర్ శాంతిభద్రతల ప‌రిర‌క్షణ‌లో విఫలమయ్యారన్నారు. ప్రజాప్రతినిధులను హ‌త్య చేసేందుకు సుపారీలు తీసుకుంటున్నారని కామెంట్స్ చేశారు. తనపై జరిగిన హత్యాయత్నంపై స్వయంగా తానే వెళ్లి ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల స‌హ‌కారంతోనే వంద‌లాది నకిలీ పాస్ పోర్టులతో రోహింగ్యాలు చలామణి అవుతున్నారన్నారు. జగిత్యాలకు చెందిన వ్యక్తి నిజామాబాద్ వేదికగా ఉగ్ర శిక్షణను ఇస్తున్నారని తెలిపారు. ఈ క్యాంపులో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ న‌లుమూల‌ల నుంచి వ‌చ్చి శిక్షణ పొందుతున్నారన్నారు. ఇంత జరుగుతున్నా అక్కడి సీపీ నాగ‌రాజు ఎందుకు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలే ఆయనను కావాలని సీపీగా తీసుకువచ్చారని, ఆయనను త‌ప్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ వివేక్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ప్రకాశ్ రెడ్డి, కెప్టెన్ బాబీ అజ్మీర పాల్గొన్నారు.

ఈనెల 10న బండి సంజయ్‌ రివ్యూ..

ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన చేరికలు, ఫైనాన్స్, ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ వైఫల్యాల అధ్యయన కమిటీలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈనెల 10వ తేదీన సమీక్ష నిర్వహించనున్నారు. కమిటీలతో విడివిడిగా ఆయన చర్చలు సాగించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు.


Next Story

Most Viewed