వరంగల్ ఘటనపై ఎర్రబెల్లి ఆరా.. నిర్లక్ష్యాన్ని సహించమంటూ ఫైర్..

by Dishafeatures2 |
వరంగల్ ఘటనపై ఎర్రబెల్లి ఆరా.. నిర్లక్ష్యాన్ని సహించమంటూ ఫైర్..
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆస్ప‌త్రిలో ఎలుక‌ల దాడిలో రోగికి తీవ్ర గాయాలు కావ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు. గురువారం ఎంజీఎం ఆర్ ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న రోగిపై ఎలుక‌లు దాడిచేసి గాయ‌ప‌ర్చిన ఘ‌ట‌న చ‌ర్చ‌నీయాంశ‌మైన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్‌గా తీసుకుంది. ఎంజీఎం సూపరిండెంట్ పై బ‌దిలీ వేటు వేసింది. అలాగే మ‌రో ఇద్ద‌రి వైద్యులను స‌స్పెన్ష‌న్ చేయాల‌ని మంత్రి హ‌రీశ్ రావు అధికారుల‌ను ఆదేశించారు. ఈ మేర‌కు ఆస్ప‌త్రిలోని ప‌రిస్థితిపై ఆరా తీసేందుకు శుక్ర‌వారం ఉద‌యం మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ఎంజీఎం ఆస్ప‌త్రిలో త‌నిఖీలు చేప‌ట్టారు.

వార్డుల‌న్నీ క‌లియ తిరిగి ఆస్ప‌త్రిలోని వైద్య సేవ‌ల‌పై రోగులు, సిబ్బంది, అధికారులను ఆరా తీశారు. పారిశుద్ధ్య నిర్వహణ, వార్డుల నిర్వహణ, సిబ్బంది, పేషంట్లకు అందుతున్న వైద్యం వంటి అనేక అంశాలపై మంత్రి ఆరా తీశారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, హాస్పిటల్ సూపరిండెంట్ చంద్రశేఖర్, ఆర్ఎంవో, వివిధ విభాగాల అధిపతులు, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య‌ సిబ్బంది తదితరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. హాస్పిటల్ నిర్వహణపై స‌మీక్షించిన అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడారు.


మన దేశంలో ప్రపంచ స్థాయి అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యం పూర్తి ఉచితంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ పేర్కొన్నారు. ఎంజీఎంలో పారిశుధ్య ఏజెన్సీల పైనా చర్యలు ఉంటాయ‌ని మంత్రి తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామ‌న్నారు. గట్టి నిఘా పెట్టాలని, అత్యంత జాగ్రత్తగా, పేషంట్ల సేవలు కేంద్రంగా పని చేయాలని, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కొత్త సూపరిండెంట్‌ను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాకే ఎంజీఎంకు మహర్దశ వ‌చ్చింద‌ని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి గతంలో ఎంజీఎంకు బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారన్నారు. ఇదిలా ఉండ‌గా ఎంజీఎం హాస్పిటల్‌కు సాత్విక్ రూరల్ అండ్ యూత్ ఇంటిగ్రేటెడ్ అసోసియేషన్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా మూడు కోట్ల విలువైన పరికరాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా ఉచితంగా అంద‌జేశారు.



Next Story

Most Viewed