శవ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట: మంత్రి కొడాలి నాని

by Disha Web Desk 13 |
శవ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట: మంత్రి కొడాలి నాని
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరోసారి ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల్లో నువ్వొద్దు బాబూ అంటూ రాష్ట్ర ప్రజలు శిక్ష విధించినా చంద్రబాబుకు సిగ్గురావడం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో బుధవారం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ప్రతీ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నిస్తారని చివరకు చావును కూడా వదలరంటూ ఎద్దేవా చేశారు. చివరికి మహిళా దినోత్సవాన్ని కూడా రాజకీయ సభలా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారని మండిపడ్డారు. మానసికంగా దెబ్బతిన్న చంద్రబాబుకు మైండ్ చెడిపోయిందని, అసెంబ్లీకి రాకుండా ఇంటిదగ్గర కూర్చున్నారంటూ సెటైర్లు వేశారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని అందువల్లే జగన్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మంత్రి కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు శవరాజకీయాలు పుట్టుకతోనే వచ్చాయి..

చంద్రబాబుకు శవ రాజకీయాలు చేయటం పుట్టుకతో వచ్చాయంటూ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరు చచ్చిపోతారా.. వాళ్ల శవాల దగ్గరకు వెళ్లి రాజకీయం చేద్దామా అని చంద్రబాబు ఎదురుచూస్తుంటాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోవడంతో మానసిక స్పృహ కోల్పోయి పిచ్చి వాగుడు వాగుతున్నాడంటూ తనదైన స్టైల్‌లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి రాకుండా ఇంటిదగ్గర కూర్చున్నారంటూ ఎద్దేవా చేశారు. సీఎం వైఎస్ జగన్ రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్చుకోలేక ఇలా విమర్శలకు దిగుతున్నారని మంత్రి కొడాలి ధ్వజమెత్తారు.

చంద్రబాబుకు బుర్ర పనిచేయడం లేదు..

వైఎస్ జగన్ చిన్న వయసులోనే ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు సహకరించాల్సింది పోయి అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. సీఎంపై ఇంగిత జ్ఞానం లేకుండా చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. సీఎం జగన్ ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లవచ్చని చంద్రబాబు మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలను చూస్తుంటే ఆయనకు మైండ్ చెడిపోయిందంటూ, బుర్ర పని చేయడం లేదంటూ ఘాటు విమర్శలు చేశారు. మూడేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో వైసీపీ విజయదుందుభి మోగించిందని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ ఫలితాలను బట్టి చూస్తే ప్రజలు టీడీపీని ఎప్పుడో పక్కన పెట్టేశారని తెలుస్తోందన్నారు. చంద్రబాబు సిగ్గులేకుండా కోర్టుకు వెళ్లి 21 మున్సిపాలిటీల ఎన్నికలను అడ్డుకున్నారని... కోర్టు తీర్పు రాగానే ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 21 మునిసిపాలిటీలలో ప్రజలతీర్పు ఎలా ఉంటుందో చంద్రబాబు చూస్తాడు అంటూ కొడాలి నాని హెచ్చరించారు.

ఎన్టీఆర్ పేరుపెడితే తప్పేంటి..?

దివంగత సీఎం ఎన్టీఆర్, వంగవీటి మోహన రంగాలపై మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ కేవలం నిమ్మకూరుకు మాత్రమే చెందిన వ్యక్తి కాదని కొడాలి నాని అన్నారు. విజయవాడ కేంద్రంగా ఏర్పడిన జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంలో తప్పేంటని నిలదీశారు. అన్ని రకాల సౌలభ్యాలు ఉన్న విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెడితే తప్పేంటి అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. విజయవాడ ఏమైనా పక్క దేశంలో ఉందా చెప్పాలంటూ కొడాలి నాని టీడీపీ నేతలను ప్రశ్నించారు. మరోవైపు వంగవీటి మోహన రంగా సైతం ఎంతో ప్రజాదరణ కలిగిన నేత అని మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు. వంగవీటి మోహన రంగాకు వైసీపీ ఎప్పుడూ గుర్తింపు ఇస్తూనే ఉందని స్పష్టటం చేశారు. సీఎం జగన్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు రావడంతో తట్టుకోలేకపోతున్న టీడీపీ నేతలు కావాలనే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారంటూ మంత్రి కొడాలి నాని ఆరోపించారు.



Next Story

Most Viewed