బీజేపీ, కాంగ్రెస్‌వి మాఫియా మాటలు : మంత్రి జగదీష్ రెడ్డి

by Dishafeatures2 |
బీజేపీ, కాంగ్రెస్‌వి మాఫియా మాటలు : మంత్రి జగదీష్ రెడ్డి
X

దిశ,హుజూర్ నగర్: ప్రతి పక్ష నాయకులు ప్రతిచోట ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు ఆపడానికి కోర్టు స్టేలు తేవడంలో ఉద్దేశ్యమేమిటి అని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతి చోట ఇదే జరుగుతుందని..మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టకుండా 315 కేసులు వేసిన కేసీఆర్ చిత్తశుద్ది కింద నిలవలేదని అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ఎన్నెస్పీ క్యాంపులో రూ.7.20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. స్థాయిలేని వారు కేసీఆర్ పై మాట్లాడుతున్నారని, ప్రజలు అడిగే ప్రశ్నలకు వారి వద్ద సమాధానాలు లేవని విమర్శించారు.

బీజేపీ,కాంగ్రెస్‌లు పనికిమాలిన మాఫియా మాటలు మాట్లాడుతున్నాయని ఎద్దేవా చేశారు. మూడు పార్టీలు తిరిగి వచ్చిన ఓ పార్టీ అధ్యక్షుడు, ఏ పార్టీ నమూనాను అభివృద్ధి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డబ్బులు సంపాదించి ప్రజలకు పెట్టాలనేదే సీఎం కేసీఆర్ అభిమతం అన్నారు. 60 ఏళ్లుగా చేయలేని అభివృద్దిని.. చేస్తున్న వారిని చేయనీయడం లేదన్నారు. దీర్ఘకాలిక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అభివృద్ధి జరగలేదో చెప్పాలన్నారు. అభివృద్ధిలో పట్టణ,పల్లెలు పోటీపడుతున్నాయని తెలిపారు. గతంలో ప్రారంభించిన హుజూర్ నగర్ అభివృద్ది పనులు పూర్తి చేయడంలో తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. పనులు చేయకుండా కేసులు వేయడం సరికాదని కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి అన్నారు.

అవకాశవాద రాజకీయాలు చేయొద్దు

నియోజకవర్గంలో ప్రతి పనికి కోర్టు స్టేలతో అడ్డుపడుతూ అవకాశ వాద రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. ఎంపీ ఉత్తమ్ కొద్దిగా మానసికంగా దెబ్బతిన్నట్లు అనిపిస్తోందని, అభివృద్ధిలో పోటీపడాలని చెప్పినా వినకుండా ఈ మధ్య తరచుగా అసహనానికి గురవుతున్నారని విమర్శించారు. ఇటీవల రూ.6 కోట్లు నిధులు తీసుకొచ్చిన బైపాస్ రోడ్డు పనుల నిలుపుదలకు కోర్టు నోటీసులు పంపించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిలో కొట్టుకుపోతామనే భయంతో ఉత్తమ్ బతుకుతున్నారని ఎద్దేవా చేశారు.

18 ఎకరాలు ఉన్న ఎన్నెస్పీ క్యాంపు స్థలంలో రిటైరైన నాయకులు తిష్టవేశారని, త్వరలోనే ఖాళీ చేయిస్తామని స్పష్టం చేశారు. అభివృద్ది విషయంలో రాజీపడేది లేదన్నారు. సమావేశంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ గెల్లి అర్చన రవి,వైస్ ఛైర్మన్ జక్కుల నాగేశ్వరరావు,మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి,మున్సిపల్ కమిషనర్ కె.శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed