జగన్ మూడేళ్ల పాలన ఎలా ఉందంటే..

by Javid Pasha |
జగన్ మూడేళ్ల పాలన ఎలా ఉందంటే..
X

దిశ, ఏపీ బ్యూరో : సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసి 1,000 రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఏ ప్రభుత్వం చేయనంత ఘనంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత తమదే అని చెబుతున్నారు. నాడు -నేడు, అమ్మఒడి, రైతు భరోసా వంటి విప్లవాత్మక పథకాలతో తమ పరిపాలన ఘనంగా సాగుతుందని వైసీపీ చెబుతున్నది. సీఎం జగన్ మాత్రం ఈ వేడుకలకు దూరంగా ఉండడం విశేషం. కానీ వైసీపీ నేతలు, శ్రేణులు పోస్టులతో సోషల్ మీడియా హోరెత్తుతున్నది. వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అంశాలపై ఆ పార్టీ సానుభూతిపరులు జగన్‌ను కొనియాడుతున్నారు.

2019 ఎన్నికల్లో 151 సీట్లతో కనీవినీ ఎరుగని విజయం సాధించిన జగన్, ఆ మరుక్షణం నుంచే సంక్షేమ పథకాలపై దృష్టి సారించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా వరుస పథకాలతో జనాన్ని సైతం ఊపిరి ఆడనివ్వలేదు. దీంతో ఖజానాపై పెను భారం పడుతున్నా.. పథకాల అమల్లో ఏ మాత్రమూ లోటు రానివ్వలేదు. రిజర్వ్ బ్యాంక్ సైతం ఈ తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది . 2020-21తో పోలిస్తే 2021-22 లో 33. 5 శాతం వ్యయం పెరిగినట్టు ఇప్పటికే స్పష్టం చేసింది. అయినా ప్రతి సందర్భానికి తగినట్టుగా ఒక్కో కొత్త సంక్షేమ పథకాన్ని తెరపైకి తెస్తూ ముందుకు వెళుతున్నారు.


దీంతో ప్రజల్లో జగన్ ఇమేజ్ ఇంకా బలంగా మారింది అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అభివృద్ధి పరంగానూ జగన్ పాలన దోసుకుపోతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు పేర్కొంటున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాంటి వాటిలో ఏపీనే టాప్ అని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో వచ్చిన 51 శాతం ఓట్లను మరింత పెంచుకోవాలన్న లేదా కనీసం అలానే నిలబెట్టుకోవాలన్న ఈ సంక్షేమ పథకాల కొనసాగింపే ముఖ్యం భావించి, సమాజంలోని అన్ని వర్గాల వారికి ఏదొక రూపంలో నగదు ప్రయోజనం ఉండేలా పథకాల రూపకల్పన చేస్తూ వస్తున్నది జగన్ సర్కార్.

సంక్షేమ పథకాల్లో కనపడిన దూకుడు డెవలప్మెంట్ పరంగా రాష్ట్రంలో కనపడటం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ పేరుతో అనేక ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల్ని ఆపేశారని, ఇక రోడ్ల మరమ్మతులు చాలా చోట్ల జరగలేదని పేర్కొంటున్నారు. ఇవన్నీ సామాన్యుడికి ఇబ్బంది కరంగా ఉండేవేనని అంటున్నారు. ఇక ఆస్తి పన్ను, చెత్త పన్ను లాంటి వాటిపై విపక్షాల వ్యతిరేక ప్రచారంతో ప్రభుత్వ ప్రతిష్ఠ కొంత మసకబారిందని అంటున్నారు. ఇబ్బడిముబ్బడిగా రాష్ట్రం చేస్తున్న అప్పులతోపాటు వాటిని ఎలా తీరుస్తారన్న దానిపై క్లారిటీ లేకపోవడం కూడా పాలనకు ఓ మచ్చంటున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు తన కుటుంబ సభ్యులను అసెంబ్లీ సాక్షిగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అవమానించారని కన్నీరు పెట్టుకోవడం కూడా అధికార పార్టీ వ్యవహార శైలిపైనా విమర్శలు వచ్చాయి. ఏకంగా కొంతమంది మంత్రుల మాటతీరు, వినియోగిస్తున్న భాష జగన్ తలుచుకుంటే అదుపులో పెట్టుండేవారే అన్న అభిప్రాయం జనంలోకి బలంగా వెళ్లిందని చెబుతున్నారు.


ఎదురు దెబ్బలు..

రెండున్నరేళ్లుగా సీఎం జగన్ పాలనలో ఒక పక్క నిత్యావసరాల ధరలు కొండెక్కాయని, సినిమా టికెట్స్ ధరలపై దృష్టి కేంద్రీకరించిందని విపక్షాలు చేసిన ప్రచారం జనంలోకి వెళ్లిపోయింది. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా ఈ అంశాన్ని డీల్ చేసిన విధానం సరిగా లేదనే ఫీలింగ్ అందరిలోనూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులతో పీఆర్సీ పెంపు సందర్భంగా వివిధ ప్రభుత్వ కమిటీలు వ్యవహరించిన తీరుపై ఉద్యోగ సంఘాలు ఇక కోపంగానే ఉంటున్నాయి. ప్రస్తుతానికి వివాదం సమసిపోయినా ఎన్నికల సమయానికి ఉద్యోగుల మైండ్ ఎలా ఉంటుందోననే ఆందోళన అధికార పార్టీ వర్గాల్లో కనిపిస్తున్నది. ఇక సొంత బాబాయ్ వివేకా హత్య కేసు జగన్ ప్రభుత్వానికి ఓ చెంపపెట్టు.

ఈ కేసులో ఏకంగా పార్టీ ఎంపీ పేరు ప్రచారంలో ఉండడం, విచారణ చేస్తున్న సీబీఐ అధికారిపైనే ఆరోపణలు చేయడం, హత్య గావించబడ్డ వివేకా కుమార్తె స్వయంగా ముఖ్యమంత్రి తనకు సహాయం చేయలేదనడం జనాల్లో అనేక అనుమానాలను రేకెత్తించింది. తాజాగా అమరావతి విషయంలో హైకోర్టు తీర్పు కూడా ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలానే ఉంది. అమరావతి రైతులకు గత ప్రభుత్వం వాగ్దానం ప్రకారం 3 నెలల్లో ప్లాట్లు రెడీ చేసి ఇవ్వడంతోపాటు రాజధాని భూముల్ని ఆ అవసరాలకు తప్ప వేరే వాటి కోసం తాకట్టు పెట్టవద్దు అని ఘాటుగా చెప్పి ప్రభుత్వానికి షాకిచ్చిందని విపక్షాలు చెబుతున్నాయి.

ఇలా కొన్ని అంశాల్లో ప్రభుత్వ తీరు లబ్ధిదారుల మనసు గెలుస్తుండగా, అభివృద్ధి, వ్యవహార శైలి లాంటి అంశాల్లో మాత్రం జగన్ పాలనకు అత్తెసరు మార్కులే పడుతున్నాయి. ముఖ్యంగా ప్రజలతో మరింత ఎక్కువగా మమేకం కావాల్సిన అవసరాన్ని సీఎం గుర్తించాలి. కనీసం రానున్న ఏడాదిన్నరలోనైనా అభివృద్ధి కార్యక్రమాలపై జగన్ దృష్టిపెట్టాలనే వాదన బలంగా వినపడుతుంది.

Next Story

Most Viewed