ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం అదే

by Hajipasha |
ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం అదే
X

దిశ, నేషనల్ బ్యూరో : నరేంద్రమోడీ ఆదివారం (జూన్ 9న) సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని కర్తవ్య పథ్‌‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మన దేశంలో వరుసగా మూడుసార్లు ప్రధాని పదవిని చేపట్టిన నాయకుడు జవహర్ లాల్ నెహ్రూ మాత్రమే. ఆ రికార్డును ఇప్పుడు మోడీ సమం చేయబోతున్నారు. ఆదివారం జరిగే మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలంటూ పలు దేశాల అధినేతలకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. ఈ జాబితాలో బంగ్లాదేశ్‌, శ్రీలంక, భూటాన్‌, నేపాల్‌, మారిషస్‌ దేశాధినేతలు ఉన్నారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా ఇప్పటికే మోడీ ఆహ్వానాన్ని అంగీకరించినట్లు సమాచారం.బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా శుక్రవారం భారత్‌లో పర్యటించనుండగా.. ఆమె తన పర్యటనను ఆదివారం మధ్యాహ్నం వరకు పొడిగించుకున్నారు. నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమాల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్గే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్‌ సహా పలువురికి కూడా ఆహ్వానాలు వెళ్లాయి.

అమెరికా తరఫున సలీవన్ హాజరు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోడీని అభినందించారు. వరుసగా మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించడంపై మోడీకి, బీజేపీకి ఆయన అభినందనలు తెలిపారు. ఉభయ దేశాల మధ్య సంబంధాల్లో కొత్త ప్రభుత్వం నుంచి మరింత ఊపు అందుకోగలదని ఆశిస్తున్నానని బైడెన్ పేర్కొన్నారు. ఇక అమెరికా తరఫున బైడెన్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్ మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు.

కెనడా ప్రధాని ట్రూడో అభినందనలు

ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీ విజయం సాధించడంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అభినందనలు తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత ముందుకు వెళ్లేలా మోడీ ప్రభుత్వంతో కలిసి కెనడా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన చెప్పారు. ఈమేరకు ట్రూడో ఓ ట్వీట్ చేశారు. ఖలిస్తానీ వేర్పాటువాది హర్‌దీప్‌సింగ్‌ నిజ్జర్ హత్యతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ, మోడీకి ప్రత్యేకంగా ట్రూడో అభినందనలు తెలియజేశారు.Next Story

Most Viewed