ఆ జిల్లాలో జోరుగా భూ దందాలు.. కలెక్టరేట్ సమీపంలో ఖరీదైన భూమి కబ్జా!

by Web Desk |
ఆ జిల్లాలో జోరుగా భూ దందాలు.. కలెక్టరేట్ సమీపంలో ఖరీదైన భూమి కబ్జా!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ నగరంలోని ప్రైమ్ లొకేషన్ లోని భూమి అది. ఈ భూమి తనదేనంటూ ఓ వ్యక్తి విక్రయించాడు. కొనుగోలు చేసిన వారు భూమి కబ్జా చేసుకునేందుకు వెళ్తే ఈ భూమితో మీకేం సంబంధం అంటు భూమి యజమాని లేదా కొనుగోలు చేసుకున్న వారు ప్రశ్నించారు. భూమిని అధికారికంగా తమకు రిజిస్ట్రేషన్ చేశారని వారు తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లు చూపారు. అమ్మిన వ్యక్తి గతంలోనే వేరే వారికి రిజిస్ట్రేషన్ చేశాడని అక్కడున్న వారి నుంచి సమాధానం రావడం తో ఖంగు తినడం వీరి వంతయింది. ఇలా భూమి తమదేనంటూ మాయమాటలు చెప్పగానే మోసపోతున్నవారే ఎక్కువయ్యారు.

డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తున్న గ్యాంగులు కొన్నయితే, సంబంధం లేని భూమిని దర్జాగా అమ్మేస్తున్న గ్యాంగులు మరికొన్ని అయ్యాయి. పాత కాలం నాటి రికార్డులు చూపిస్తూ తమ భూమేనంటూ కబ్జాలకు ప్రయత్నిస్తున్న గ్యాంగులు కూడా తీవ్రం అయ్యాయి. అయితే ఈ వ్యవహారాల్లో పోలీసులు తలదూర్చే అవకాశం లేకపోవడం కూడా మాఫియా రెచ్చిపోవడానికి కారణంగా తెలుస్తోంది. సివిల్ తగాదాల్లో మీరెలా తల దూరుస్తారంటూ పోలీసులను కొన్ని గొంతుకలు ప్రశ్నిస్తుండడం కూడా తలనొప్పిగా మారింది. ఇటీవల కరీంనగర్ లోని ఓ భూ క్రయవిక్రయ లావాదేవీలో తాను మోసపోయానని బాధితుడు పోలీసు అధికారులను ఆశ్రయించాడు. దర్జాగా అగ్రిమెంట్ కూడా రాసిచ్చాడని, అయితే సదరు స్థలాన్ని గతంలోనే వేరే వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసి మోసగించాడని దీనివల్ల తాము లక్షల రూపాయలు నష్టపోయామని బాధితులు పోలీసులకు వివరించారు.

దీంతో పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేసి నిందితులపై చట్టపరమైన చర్యలకు పూనుకున్నారు. ఈ క్రమంలో ల్యాండ్ మాఫియా ప్రతినిధి ఒకరు సివిల్ తగాదాల్లో మీరెలా జోక్యం చేసుకుంటారంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఒకే స్థలాన్ని ఇద్దరికి అమ్మడం నేరం కదా సార్ ఛీటింగ్ కిందకే వస్తుంది కదా అని పోలీసు అధికారులు అంటే సివిల్ మ్యాటర్ అని వదిలేయండి లేదంటే బావుండదు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చేశాడు సదరు మాఫియా ప్రతినిధి.

తన వృత్తిని అడ్డుగా పెట్టుకుని దందాలు కొనసాగిస్తున్న ఆయన టీం గురించి ఆరా తీస్తే ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది. అక్రమాలకు పాల్పడే వారిని తన నీడన జీవనం సాగించేందుకు సపరేట్ గా ఓ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని పర్సంటేజీల పర్వానికి తెరలేపాడని ప్రచారం జరుగుతోంది. తనతో పాటు ఇతర సంస్థల్లో పనిచేసి సహచరులను కూడా తన కూటమిలో చేర్చుకుని దందాలకు తెరలేపినట్టుగా పోలీసులు ఇప్పటి వరకూ సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది.

తవ్విన కొద్ది..

విచారణలో పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న మాఫియా ప్రతినిధి గురించి తవ్విన కొద్ది పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయని తెలుస్తోంది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఈ ప్రతినిధి ఏర్పాటు చేసుకున్న కోటరీలో తన వృత్తికి చెందిన వారు ముగ్గురు నుంచి నలుగురు వరకు ఉన్నారని కూడా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇలాంటి డీల్స్ తీసుకొచ్చేందుకు కూడా ప్రత్యేకంగా కమిషన్ ఏజెంట్లను కూడా తయారు చేసుకుని ఓ ప్రత్యేక సామ్రాజ్యాన్నే నడిపిస్తున్నాడని పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం. ఈ గ్యాంగ్ ఏఏ డీల్స్ లో ఇన్ వాల్వ్ అయింది, వసూళ్ల పర్వం ఎంతమేర చేసింది, ఇందులో ఉన్న వారి నేర చరిత్ర ఏంటీ అన్న పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లుగా సమాచారం.

ఒకే భూమి ముగ్గురికి..

కరీంనగర్ కలెక్టరేట్ సమీపంలో అత్యంత ఖరీదైన భూమి చాలా కాలంగా ఖాళీగా ఉంటోంది. ఈ భూమికి సంబందించిన యజమాని వద్ద కొనుగోలు చేసుకున్న ఓ వ్యక్తి ఏకంగా ఒకరికి రిజిస్ట్రేషన్ చేయగా మరో ముగ్గురికి అగ్రిమెంట్లు చేసి రూ. కోట్లు వసూలు చేశాడని బాధితులు చెబుతున్నారు. ఇలా ఒకే భూమిని పలువురికి అమ్మిన నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులపై ఒత్తిళ్లకు గురి చేస్తుండటం గమనార్హం.

అయితే ఈ వ్యవహారాలపై కరీంనగర్ సీపీ సత్యనారాయణ చాలా సీరియస్ గా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. భూ దందాల మాటున అక్రమ వ్యవహారాలకు పాల్పడుతున్న గ్యాంగ్ లతో పాటు వీరికి అండదండలు అందిస్తున్న వారెవరు అన్న వివరాలను సేకరించాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. వీరు కేవలం భూ దందాలకే పరిమితం అయ్యారా లేక ఇతర అక్రమ దందాల్లోనూ భాగస్వాములు అయ్యారా అన్న వివరాలు కూడా సేకరిస్తున్నట్లు సమాచారం.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed