కేఎల్ రాహుల్ దాతృత్వం.. ఆపరేషన్ కోసం రూ.31 లక్షల విరాళం

by Web Desk |
కేఎల్ రాహుల్ దాతృత్వం.. ఆపరేషన్ కోసం రూ.31 లక్షల విరాళం
X

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ 11 ఏళ్ల క్రికెటర్ ప్రాణాలను కాపాడి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఐదవ తరగతి చదువుతున్న వరద్ అనే బాలుడు గత సెప్టెంబర్ నుంచి అరుదైన రక్త రుగ్మత వ్యాధి (అప్లాస్టిక్ అనీమియా)తో బాధపడుతూ ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో హెమటాలజిస్టుల సంరక్షణలో చికిత్స పొందుతున్నాడు. అతనికి అత్యవసరంగా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని వైద్యులు తెలిపారు. అందుకోసం రూ.35 లక్షల వరకు ఖర్చవుతుందని పేర్కొన్నారు.

అయితే, వరద్ తండ్రి నలవాడే బీమా ఏజెంట్. తల్లి స్వప్న ఝా సాధారణ గృహిణి. ఆపరేషన్ కోసం అంతడబ్బులు లేకపోవడంతో గత డిసెంబర్ నెలలో వీరు ఆర్థిక సాయం కోసం ప్రచారం ప్రారంభించారు. ఈ విషయం కాస్త కేఎల్ రాహుల్ బృందానికి తెలియడంతో చలించిపోయిన టీమిండియా ప్లేయర్ రూ.31 లక్షల ఆర్థిక సాయం అందజేశాడు. వరద్ ప్లేట్‌లెట్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నాయని, అతని రోగనిరోధక వ్యవస్థ ఇన్‌ఫెక్షన్‌లకు గురవకుండా ఉండాలంటే ఆపరేషన్ ఒక్కటే శాశ్వత నివారణ అని వైద్యులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాహుల్ స్పందిస్తూ.. 'శస్త్రచికిత్స విజయవంతమై వరద్ బాగానే ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. వరద్ త్వరగా కోలుకుని తన కలలను సాకారం చేసుకుంటాడని నేను ఆశిస్తున్నాను. నా సహకారం మరింత మంది ముందుకు వచ్చి వారికి సహాయం చేయడానికి ప్రేరణనిస్తుందని నేను ఆశిస్తున్నాను' అని తెలిపారు.

Next Story