కేంద్రంతో యుద్ధం ఇక తీవ్రం.. మంత్రులకు కేసీఆర్ కీలక సూచన!

by Disha Web Desk 2 |
కేంద్రంతో యుద్ధం ఇక తీవ్రం.. మంత్రులకు కేసీఆర్ కీలక సూచన!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర మంత్రి స్థాయిలో పీయూష్ గోయల్ తన వైఖరిని వెల్లడించినా ప్రధాని మోడీ ఏ విధంగా స్పందిస్తారో చూద్దామనే తీరులో ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య చర్చ జరిగింది. వడ్ల కొనుగోళ్ళ విషయమై మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసిన రాష్ట్ర మంత్రుల బృందం అక్కడి పరిణామాలకు సీఎం కేసీఆర్‌కు వివరించింది. ప్రగతి భవన్‌లో సీఎంతో మధ్యాహ్నం నుంచి రాత్రి 9.30 గంటల వరకు సుదీర్ఘంగా చర్చ, సమీక్ష జరిగింది. ధాన్యం సేకరణ అంశంతో పాటు ఎస్టీ రిజర్వేషన్ల తీర్మానంపై లోక్‌సభ వేదికగా కేంద్ర మంత్రి చేసిన కామెంట్లు, మెడికల్ కాలేజీల మంజూరులో తెలంగాణకు జరిగిన అన్యాయం, తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చ జరిగినట్లు తెలిసింది.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో జరిగిన చర్చల సందర్భంగా ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలను సీఎంకు మంత్రులు వివరించారు. తాను ఒక కేంద్ర మంత్రి హోదాలోనే చర్చించనున్నట్లు పేర్కొన్నారని తెలిపారు. కేవలం తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలకే తాను పరిమితమవుతున్నట్లు కూడా నొక్కిచెప్పినట్లు సీఎంకు తెలిపారు. రాజకీయపరమైన అంశాలను తన దగ్గర ప్రస్తావించవద్దనే షరతు కూడి విధించినట్లు వివరించారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయంగా ఎలాంటివి ఉన్నా తనకు అవసరం లేదని కూడా స్పష్టం చేసిన విషయాన్ని సీఎంకు మంత్రులు వివరించారు.

రానున్న రోజుల్లో గ్రామసభలు, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లలో జరిగే తీర్మానాలను నేరుగా ప్రధానికి పంపించే ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా మంత్రులకు సీఎం సూచించినట్లు సమాచారం. ఆ తర్వాత ప్రధాని నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూద్దామని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆ స్పందనకు అనుగుణంగా కేంద్రంపై వత్తిడి పెంచడానికి ఎలాంటి వ్యూహాన్ని రూపొందించుకోవాలనేదానిపై తొందర్లో నిర్ణయం తీసుకుందామని సూచించినట్లు తెలిసింది.

అన్ని గ్రామ పంచాయతీల్లో శనివారం, మండల పరిషత్‌లలో ఆదివారం, జిల్లా పరిషత్‌లలో ఈ నెల 30న తీర్మానాలు చేయాల్సిందిగా ఇప్పటికే ప్లాన్ ఖరారైంది. మున్సిపాలిటీలు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లోనూ ఇలాంటి తీర్మానాలనే చేయాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. ఆ వెంటనే ఈ తీర్మానాలను నేరుగా ప్రధానికి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు పోస్టు ద్వారా పంపాలన్నది పార్టీ వ్యూహం.

కేంద్రంతో యుద్ధం ఇక తీవ్రం

కేంద్ర ప్రభుత్వంతో యుద్ధాన్ని తీవ్రతరం చేయాల్సిందననే మంత్రులకు సీఎం స్పష్టమైన సందేశాన్ని ఇచ్చినట్లు తెలిసింది. ఇకపైన ప్రతీరోజు ఒక మంత్రి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే విధంగా మీడియా సమావేశాలను నిర్వహించాలని సూచించినట్లు సమాచారం. వడ్ల కొనుగోలు అంశంలో కేంద్రంపై పోరును ఆపే ప్రసక్తే లేదని, రాష్ట్రానికి, రైతులకు న్యాయం జరిగే వరకు టీఆర్ఎస్ కొట్లాడుతూనే ఉంటుందని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రంతో ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇకపైన సీరియస్ అవుతుందని, ఉధృతంగానే ఉద్యమం తరహాలో జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో జరిగిన చర్చల వివరాలను స్వయంగా మంత్రులే మీడియాకు శనివారం ఉదయం వివరించనున్నారు.

టార్గెట్ బండి సంజయ్

కేంద్ర మంత్రితో రాష్ట్ర మంత్రుల బృందం జరిపిన చర్చలు రెండు ప్రభుత్వాలకు సంబంధించినవి కావడంతో ఇకపైన ది బీజేపీపైన టీఆర్ఎస్ పోరుగా మారనున్నది. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ టార్గెట్‌గా టీఆర్ఎస్ నేతలు (మంత్రులు కూడా) విరుచుకుపడనున్నారు. వరి వేస్తే ఇబ్బందులు ఉంటాయని రైతులకు సూచించినా బండి సంజయ్ మాత్రం 'వరి పంటే వేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఎట్ల కొనదో మేం చూసుకుంటాం..' అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్రంగా స్పందించనున్నారు. వరిసాగుపై బండి సంజయ్ ఏయే వేదికల మీద, ఏ సందర్భంలో ఎలాంటి కామెంట్లు చేశారో ఇప్పటికే వీడియోలను మంత్రులు సిద్ధం చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని బీజేపీ ఆఫీసు ముందు పారపోసే అంశంపైనా సీఎం, మంత్రులు చర్చించుకున్నట్లు తెలిసింది.

తెలంగాణకు చెందిన నలుగురు ఎంపీలు ఉన్నా స్వంత రాష్ట్ర రైతులకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు స్పందించడంలేదంటూ మీడియా సమావేశాల వేదికగా టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించనున్నారు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా కిషన్‌రెడ్డి ద్వారా తెలంగాణకు, వడ్ల విషయంలో రైతులకు జరిగిన మేలు ఏమీ లేదని కూడా ప్రస్తావించనున్నారు.

తీర్మానాల్లో ఏముంటుంది?

"ఈ రోజు జరిగిన గ్రామ పంచాయతీ సమావేశంలో తెలంగాణలో పండిన రబీ వరి ధాన్యాన్ని మొత్తం భారత ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గౌరవ ప్రధాన మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానించడమైనది" అని గ్రామ సభ తీర్మానం చేసి ప్రధానమంత్రితో పాటు కేంద్ర ఆహార పౌరసరఫరాల మంత్రి పీయూష్ గోయల్‌లకు పోస్టు ద్వారా పంపడంపై ఇప్పటికే సీఎం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదే తరహాలో మండల పరిషత్, జిల్లా పరిషత్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, మున్సిపాలిటీలు కూడా తీర్మానాలను చేయనున్నాయి. వీటన్నింటినీ ఒక కాపీని ముఖ్యమంత్రికి కూడా పోస్టు ద్వారా పంపడానికి ఆదేశాలు జారీ అయ్యాయి.

Next Story

Most Viewed