ఇటు బాధ్యతల స్వీకరణ.. అటు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

by Disha Web Desk 13 |
ఇటు బాధ్యతల స్వీకరణ.. అటు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్/కల్వకుర్తి : ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కల్వకుర్తి మండల పరిషత్ అధ్యక్షురాలు ఎంపిక ప్రక్రియ క్లైమాక్స్ కు చేరింది. ఎంపీపీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఎంపిక కావలసిన అభ్యర్థి ఓడిపోవడంతో.. గెలిచిన ఎంపిటిసి లు సునీత, మనోహర పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరకపోవడంతో.. ముఖ్య నేతలు కలుగజేసుకుని ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చారు. రెండున్నర సంవత్సరాలు ఒకరు.. మరో రెండున్నర సంవత్సరాలు మరొకరు బాధ్యతలు నిర్వహించుకునేలా ఒప్పందం కుదిర్చారు.

ఈ క్రమంలో మొదటి రెండున్నర సంవత్సరాలు ఎంపీపీగా కొనసాగే అవకాశం సునీత కు దక్కింది. ఈ క్రమంలో పది లక్షల రూపాయలకు పైగా చేతులు మారడం. ముఖ్య నేతలు సైతం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇటీవల ఎంపీపీ గా కొనసాగుతున్న సునీత గడువు ముగిసిన నేపథ్యంలో తనకు అవకాశం కల్పించాలని మనోహర గత కొంత కాలం నుండి పట్టు పడుతూ వచ్చింది. కానీ ఊహించని విధంగా సునీత అందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో రెండు దఫాలుగా జరిగిన మండల సమావేశాల సందర్భంగా ఎంపిటిసి మనోహర తో పాటు, మిగతా సభ్యులందరూ ఆమెకు మద్దతుగా సమావేశాలు బహిష్కరించి ఆందోళన నిర్వహించిన సంఘటనలు పాఠకులకు విదితమే.

దీంతో ఆమె రాజీనామా చేసే వరకు సమావేశాలు జరగనివ్వమని సభ్యులు పట్టుపట్టడంతో.. ఎట్టకేలకు సునీత గత పది రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేసింది. ఖాళీ అయిన ఎంపీపీ పదవికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో వైస్ ఎంపీపీ గా ఉన్న గోవర్ధన్ కు సోమవారం బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో పాటు, మరికొంత మంది ప్రముఖులు హాజరై ఎంపీపీ గా బాధ్యతలు స్వీకరించిన వైస్ ఎంపీపీ అభినందించారు.

పూర్తికాలం ఎంపీపీ గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో జరిగే హంగామా కన్నా మరింత ఎక్కువగా జరగడంతో.. ఎంపీపీ పదవిపై ఆశలు పెట్టుకున్న మనోహర తో పాటు, ఆమెకు మద్దతు ఇస్తున్న సభ్యులు సైతం ఒకింత ఆందోళనకు గురయ్యారు. ఒక వైపు హంగామా జరుగుతుండగానే.. ఎంపీపీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ సోమవారమే విడుదల కావడంతో.. కల్వకుర్తి రాజకీయాలలో రసవత్తర చర్చలకు దారి తీసింది.


ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 22 లోపు అధికారులు మండల పరిషత్ సభ్యులను సమావేశపరిచి నామినేషన్లు స్వీకరిస్తారు, 26న ఉదయం 11 గంటలకు ఎంపీపీ ఎన్నికలు నిర్వహిస్తారు. పలు కారణాల వచ్చే ఆరోజు ఎంపిక జరగకుంటే మరుసటి రోజు 27న ఎన్నికలు నిర్వహిస్తారు. ఎంతో ఉత్కంఠ రేపుతూ వస్తున్నా.. ఎంపీపీ పదవి ఎందుకు సజావుగా సాగుతుందా.. లేక మరింత ఉత్కంఠను రేపే విధంగా నాయకులు ఎత్తుగడలు వేస్తారా అన్న.. చర్చలు జరుగుతున్నాయి.


Next Story