పాలమూర్ చౌరస్తాలో పొంచి ఉన్న ప్రమాదం.. అధికారుల నిర్లక్ష్యeనికి ఇద్దరు బలి

by Web Desk |
పాలమూర్ చౌరస్తాలో పొంచి ఉన్న ప్రమాదం.. అధికారుల నిర్లక్ష్యeనికి ఇద్దరు బలి
X

దిశ, కల్వకుర్తి : జాతీయ రహదారి నిబంధనలకు పాతర వేస్తూ రోడ్డు కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా కల్వకుర్తి పట్టణంలో రోడ్ల విస్తరణ జరగడంతో పాలమూర్ చౌరస్తా మృత్యు మార్గానికి దారిలా మారింది. గతంలో జడ్చర్ల నుండి కోదాడ వరకు 214 కిలోమీటర్ల ఆర్ అండ్ బి రోడ్డు ఉండటంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిగా గుర్తించి ఇంతకుముందు 7 మీటర్ల వెడల్పులో బీటీ రోడ్డు ఉండటం వల్ల దానిని 10 మీటర్ల వరకు రోడ్డు విస్తరణకు అనుమతులు లభించాయి. జడ్చర్ల నుండి కోదాడ వరకు జాతీయ రహదారి పనుల్లో భాగంగా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు కల్వకుర్తి పట్టణంలోని పాలమూర్ చౌరస్తా కూడలి వద్ద రోడ్డు విస్తరణలో అవకతవకలు చేశారు. ఈ జాతీయ రహదారి నిర్మాణానికి గాను కేంద్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు విడుదల చేసింది.

దీనిని ఐదు ప్యాకేజీలుగా విభజించారు. జడ్చర్ల నుండి కల్వకుర్తి , కల్వకుర్తి నుంచి మల్లేపల్లి వరకు 94 కిలోమీటర్ల మేరకు 510 కోట్ల రూపాయలతో రోడ్డు పనులు వేగవంతంగా కొనసాగిన తరుణంలో కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తా, హైదరాబాద్ చౌరస్తా రోడ్ల విస్తరణలో జాప్యం జరిగిందనే విషయం పట్టణ ప్రజలందరికి విదితమే. వాస్తవానికి మొత్తం రోడ్డు వంద అడుగుల వెడల్పు ఉండే విధంగా నిర్మాణం చేయాలని, నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా రోడ్ల వెడల్పు అవసరం లేని చోటులో ఎక్కువ ఉన్నచోట తక్కువ చేయించారు. ముందుగా జాతీయ రహదారి కోసమై సర్వే జరిగినప్పుడు పట్టణ చౌరస్తా కూడలిలో రోడ్డు విస్తరణ కోసమై కొలతలు పెట్టినప్పుడు రోడ్డుకు అనుకోని ఉన్న కొన్ని నిర్మాణాలను తొలగించాల్సింది పోయి కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై రోడ్డు విస్తరణ తగ్గించారు.

ఏ మేరకు రహదారి విస్తరణ చేయాలో ..? ఎంత సైజులో చేయాలో..? నిర్మాణంలో ఎటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించాలి..? అనే అన్ని రకాల అంశాలను అధికారుల దృష్టిలో ఉన్నా అంచనాలను తారుమారు చేసి పై స్థాయి అధికారులకు ముడుపులు సమర్పించి, పాలమూర్ చౌరస్తా కూడలి విషయంలో రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దుకాణాలు కూల్చకుండా పెద్ద ఎత్తున అధికారులు, ప్రజాప్రతినిధులు కుంభకోణం చేశారనేదని గతంలో ఆరోపణలున్నాయి. దుకాణాల యాజమానుల వద్ద సంబంధిత కాంట్రాక్టర్‌తో సహ శాఖ అధికారులు మిలాఖత్ అయి సొంత ఖజానా నింపుకోవాలనే ఆలోచన చేయడం వల్ల పాలమూర్ చౌరస్తా నేటికి ప్రమాదాలకు ఘంటికగా మారింది. గతేడాది ఒక్క వారంలోనే ఇద్దరు చనిపోగా ముగ్గురు ద్విచక్ర వాహనదారులకు గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. నేటికి మహబూబ్ నగర్ చౌరస్తాలో అనునిత్యం చిన్నచిన్న ప్రమాదాలు బయటపడుతున్నాయి.

గతంలో కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయానికి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న జిల్లా అడిషనల్ కలెక్టర్‌కు వివిధ సంఘాల నాయకులు పాలమూర్ చౌరస్తాలో జరిగిన రోడ్డు జాప్యం గురించి వివరింఛి వినతి పత్రం అందజేశారు. సత్వరమే దీనికి పరిష్కారం చూపాలని కలెక్టర్‌ను కోరారు. ఈ విషయమై పలుమార్లు పత్రికలు ప్రచురణ, ఎలక్ట్రానిక్ మీడియాలలో ప్రసరించిన ఫలితం మాత్రం శూన్యం. భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకొని ప్రమాదాలకు నెలవుగా మారిన కల్వకుర్తి పాలమూర్ చౌరస్తాను జిల్లా అధికారులు పట్టించుకోవాలి.

ప్రమాదాలకు నెలవుగా మారిన పాలమూర్ చౌరస్తాకు సమస్యకు పరిష్కారం చూపినవారవుతారు. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా నూతన కలెక్టర్ దీనిపై సమగ్ర విచారణ జరిపి జాతీయ రోడ్డు విషయంలో జాప్యం చేసిన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కల్వకుర్తి పట్టణ ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed