ప్రమాదపుటంచున ప్రయాణం.. శిథిలావస్థలో 'ఇసుక భాయి' వంతెన

by Disha Web Desk 13 |
ప్రమాదపుటంచున ప్రయాణం.. శిథిలావస్థలో ఇసుక భాయి వంతెన
X

దిశ, అమీన్ పూర్: ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ.. అభివృద్ధి చేస్తున్నామంటున్న ప్రభుత్వ హామీలు ఆచరణకు నోచుకోవడం లేదు. హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉన్న అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో అనేక కాలనీల రోడ్లను కలుపుతూ.. ఉన్న ఇసుక బావి వంతెన ప్రమాదకరంగా మారింది. ఈ వంతెన గుండా ప్రయాణం అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. నిత్యం ప్రమాదాలతో ఈ వంతెన గుండా ప్రజల ప్రయాణం కొనసాగుతుంది. రామచంద్రపురం జాతీయ రహదారి నుండి అమీన్ పూర్ మున్సిపాలిటీ లో నివాసముంటున్న సుమారు 20 కి పైగా కాలనీల ప్రజలు నిత్యం వేల సంఖ్యలో ఈ దారి గుండానే ప్రయాణం సాగిస్తున్నారు. వంతెనపై రద్దీ పెరగడంతో రోజు రోజుకు వంతెన కుంగిపోయి ప్రమాదాలకు నెలవు అవుతుంది. ఇక వర్ష కాలంలో అయితే ప్రయాణికుల బాధలు వర్ణనాతీతం. అక్రమార్కుల కబ్జా కోరల్లో నాలా కుచించుకుపోవడం తో చిన్న పాటి వర్షం పడితే చాలు నీరు వంతెన మీదుగా ప్రమాదకరంగా ప్రవహిస్తూ.. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది.



2020 సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు వంతెన మీదుగా వెళ్తున్న కార్ వరదలో కొట్టుకుపోయి ఒక యువకుడు మరణించిన విషయం విదితమే. అప్పట్లో యుద్ధప్రాతిపదికన వంతెన నిర్మాణం చేస్తామని ఇచ్చిన హామీ నేటికి నీటి మూటగానే మిగిలిందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సారి ఎన్నికలప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ప్రజా ప్రతి నిధులకి, అధికారులకు ఈ వంతెన నిర్మాణం హామీ గుర్తుకొస్తుందని, తర్వాత షరా మాములుగా ఇచ్చిన హామీని మర్చిపోతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.

అంత మా ఇష్టం..



ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పే నాయకులు ఇసుక భాయి వంతెన విషయంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోజుకు వేలాది వాహనాలు ప్రయాణించే ఇసుక భాయి వంతెన నిర్మాణాని గాలికి వదిలేసి, అంత మా ఇష్టం అన్న ధోరణితో కొంత మంది రియల్ వ్యాపారులకు అవసరమైన చోట, వెంచర్ లకు అనువైన చోట వంతెనలకు యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి నిర్మాణాలు చేస్తున్నారని, సామాన్య ప్రజల అవసరం అయిన ఇసుక భాయి వంతెన నిర్మాణాన్ని మాత్రం మాటలకు పరిమితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు, ప్రజా ప్రతినిధులు కల్పించుకుని యుద్ధ ప్రాతిపదికన నూతన వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed