88 శాతం పెరిగిన భారత ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఎగుమతులు!

by Web Desk |
88 శాతం పెరిగిన భారత ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఎగుమతులు!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ నుంచి ఇతర మార్కెట్లకు ఎగుమతి అయ్యే ఎలక్ట్రానిక్ వస్తువులు గత తొమ్మిదేళ్లలో 88 శాతం పెరిగాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రధానంగా దేశీయ తయారీకి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారానే ఈ స్థాయిలో వృద్ధి నమోదైందని పేర్కొంది. 2013-14 లో భారత ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతుల విలువ 6.6 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 50 వేల కోట్ల) నుంచి 2021-22 లో 12.4 బిలియన్ డాలర్లు(రూ. 94 వేల కోట్ల)కు చేరుకున్నాయి. ముఖ్యంగా మొబైల్ ఫోన్‌లు, ఐటీ హార్డ్‌వేర్(ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్లు), కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్(టీవీ, ఆడియో), పారిశ్రామిక ఎలక్ట్రానిక్స్, ఆటో ఎలక్ట్రానిక్స్ కీలకమైన ఎగుమతులుగా ఉన్నాయి. నేషనల్ ఎలక్ట్రానిక్స్ పాలసీ ద్వారా దేశంలోని ప్రధాన విడిభాగాలను అభివృద్ధి చేసేందుకు, తద్వారా ఎలక్ట్రానిక్ పరిశ్రమను అంతర్జాతీయంగా పోటీ పడేందుకు వీలు కల్పించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే, లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ తయారీకి ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్, సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించే పథకం(ఎస్‌పీఈసీఎస్), ఐటీ హార్డ్‌వేర్‌ పరిశ్రమకు మోడిఫైడ్ ఎలక్ట్రానిక్స్ మాన్యూఫాక్చరింగ్ క్లస్టర్స్ స్కీమ్(ఈఎంసీ 2.0), పీఎల్ఐ పథకం అమలు ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎగుమతులకు ఊతమిచ్చాయని మంత్రిత్వ శాఖ వివరించింది.


Next Story