గ్లోబల్ సంస్థకు సీఈఓ గా మరో భారతీయుడు!

by Disha Web Desk 12 |
గ్లోబల్ సంస్థకు సీఈఓ గా మరో భారతీయుడు!
X

న్యూయార్క్: ప్రముఖ గ్లోబల్ కొరియర్ డెలివరీ సేవల సంస్థ ఫెడ్ఎక్స్‌కు భారత సంతతికి చెందిన రాజ్ సుబ్రమణియం సీఈఓగా ఎన్నికైనట్టు కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలకు భారత సంతతి వ్యక్తులు నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో రాజ్ సుబ్రమణియం కూడా చేరారు. ప్రస్తుతం ఫెడ్ఎక్స్ సీఈఓ, ఛైర్మన్‌గా ఉన్న ఫ్రెడెరిక్ డబ్ల్యూ స్మిత్ ఈ ఏడాది జూన్ తర్వాత పదవీ విరమణ చేసి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉండనున్నారు.

ఆయన స్థానంలో రాజ్ సుబ్రమణియం బాధ్యతలు చేపట్టనున్నారు. భవిష్యత్తులో సంస్థ అభివృద్ధికి రాజ్ సుబ్రమణియం లాంటి సమర్థత కలిగిన వ్యక్తి లీడర్‌షిప్‌పై విశ్వాసం ఉందని స్మిత్ ఓ ప్రకటనలో అన్నారు. ఫ్రెడెరిక్ స్మిత్ గొప్ప దార్శనికత కలిగిన వ్యక్తి. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆదరణ కలిగిన కంపెనీని ప్రారంభించారు. ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలు నాకు లభించడం పట్ల గర్వంగా ఉందని రాజ్ సుబ్రమణియం అన్నారు. కాగా, ఫ్రెడెరిక్ స్మిత్ 1971లో ఫెడ్ఎక్స్‌ను స్థాపించారు. అమెరికాలోని టెనెసీ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగుతున్న ఫెడ్ ఎక్స్ సంస్థలో మొత్తం 6 లక్షల మంది ఉద్యోగులున్నారు.

రాజ్ సుబ్రమణియం మొదటిసారిగా 2020లో ఫెడ్ ఎక్స్ సంస్థ బోర్డులో చేరారు. ప్రస్తుతం ఆయన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హోదాలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటికీ బోర్డు సభ్యుడిగా కొనసాగుతారు. కేరళకు చెందిన రాజ్ సుబ్రమణియం ఐఐటీ బాంబే నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం న్యూయార్‌లోని సిరక్యూస్ యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. అనంతరం టెక్సస్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు.

Next Story

Most Viewed