తరుగు పేరిట రైతులను వేధిస్తే కఠిన చర్యలు

by Sridhar Babu |
తరుగు పేరిట రైతులను వేధిస్తే కఠిన చర్యలు
X

దిశ,నిజాంసాగర్ : తరుగు పేరిట రైతులను వేధిస్తే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆయన శుక్రవారం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సహకార సంఘం పరిధిలోని అచ్చంపేట, ఆరేపల్లి వరి కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ తో కలిసి పరిశీలించారు. తరుగు పేరిట కొందరు రైస్ మిల్లర్లు రైతులను వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు పేరొన్నారు. విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో సుమారుగా వరి కొనుగోళ్లు పూర్తి కావస్తుందని, ధాన్యం తరలింపులో జాప్యం ఏర్పడి రైతులు ఆందోళనకు గురయ్యారని తెలిపారు. అందుకు గాను రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి వరి ధాన్యం నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలలో రైస్ మిల్లర్లకు తరలించేందుకు అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా జిల్లాలో ఖాళీగా ఉన్న గోడౌన్ లో సైతం ధాన్యం నిల్వ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరో రెండు రోజులు రాష్ట్రంలో వర్షాలు

ఉన్నందున కొనుగోలు వేగంగా చేపట్టాలని, రైస్ మిల్లర్లలో లారీలు త్వరగా ఆన్ లోడ్ అయ్యేవిధంగా, హమాలీల కొరత లేకుండా ముందస్తుగా హమాలీలను సర్దుబాటు చేయాలని, తహసీల్దార్ భిక్షపతిని ఆదేశించారు. రైతు వేదికలు, సంఘ భవనాలలో వరి ధాన్యం భద్రపరచాలని సూచించారు. కాంటా వేసిన వరి ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆర్డీఓ, తహసీల్దార్లు ప్రతి రోజూ పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. రైస్ మిల్లులలో గత యాసంగి, వానకాలం సీజన్లలో సేకరించిన ధాన్యం నిల్వల దృష్ట్యా ధాన్యం లోడ్ చేసుకునేందుకు ఆలస్యం అయిందని అన్నారు. కొనుగోలు పూర్తి చేసుకొని రైతుల వివరాలు వంద శాతం టాబ్లో అప్లోడ్ చేయడంతో రైతులకు డబ్బులు జమచేసేందుకు వీలుంటుందని సూచించారు.

నాన్ ఎఫ్ ఆర్ కే బియ్యాన్ని భారత ఆహార సంస్థకు త్వరగా డెలివరీ చేయాలని మిల్లర్ లను ఆదేశించారు. అకాల వర్షాలు పడుతున్నందున ధాన్యం నిల్వలపై టార్పలిన్ కప్పి ఉంచేలా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. జిల్లాలో ఇప్పటి వరకు 44,845 మంది రైతుల నుండి 550 కోట్ల విలువ గల రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.490 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు. 97 శాతం టాబ్ ఎంట్రీ పూర్తయిందని, త్వరలో మిగతా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని హామీనిచ్చారు.

అదేవిధంగా ప్రతి వరి గింజను ప్రభుత్వం కొంటుందని, తొందర పాటు పడకుండా, ఆందోళన చెందకుండా రైతులు మనోధైర్యంతో ఉండాలని కోరారు. అందుకు గాను రైతులు సహకరించాలని అన్నారు. జిల్లా మొత్తంలో మరో ఐదు రోజుల్లో వరి ధాన్యం కొనుగోలు పూర్తి అవుతుందని తెలిపారు. రైతులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ నిచ్చారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీఓ రమేష్ రాథోడ్, తహసీల్దార్ భిక్షపతి, డిప్యూటీ తహసీల్దార్ సురేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ చందురి అంజయ్య, క్లస్టర్ లక్ష్మీనారాయణ, నాగరాజు, సీఈఓ సంగమేశ్వర గౌడ్, ట్రాన్స్పోర్టర్ సంపత్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Next Story