అన్యాయం..! కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా అక్రమంగా నిర్మాణం..

by Disha Web Desk 13 |
అన్యాయం..! కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా అక్రమంగా నిర్మాణం..
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్‌: మాకు తెల్వకుండానే మా భూమిపై ప‌ట్టా పొందిన నోముల తిరుప‌తిరెడ్డి అధికార పార్టీ నాయకుల అండదండలతో దౌర్జన్యాల‌కు దిగుతున్నాడ‌ని నోముల శ్రీనివాస‌రెడ్డి ఆరోపించారు. ఖిల్లా వ‌రంగ‌ల్ మండ‌లం మామునూరు గ్రామంలోని 337/ సిలోని 26 గుంట‌ల త‌మ భూమిపై అక్రమంగా ప‌ట్టా పొందాడ‌ని, దీనిపై తాము కోర్టుకు వెళ్లగా స్టే ఆర్డర్ కూడా వ‌చ్చింద‌ని తెలిపారు.


అయితే కోర్టు ఆర్డర్‌ను ధిక్కరిస్తూ స‌ద‌రు భూమిలో బిల్డింగ్ నిర్మాణం చేప‌డుతున్నాడ‌ని పేర్కొన్నారు. మున్సిపల్ అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లిన‌ట్లుగా తెలిపారు. అయితే అధికారుల ఆదేశాలు పాటించకుండా య‌థేచ్ఛగా త‌న ప‌నిని కొనసాగిస్తున్నాడ‌ని, ప్రశ్నిస్తే దాడుల‌కు దిగుతున్నట్లుగా శ్రీనివాస‌రెడ్డి తెలిపారు. మంగ‌ళ‌వారం దిశ ప్రతినిధిని సంప్ర‌దించిన శ్రీనివాస‌రెడ్డి భూ వివాదానికి సంబంధించిన విష‌యాల‌ను వెల్లడించారు.

ఆయ‌న తెలిపిన వివ‌రాల ప్రకారం.. ఖిల్లా వ‌రంగ‌ల్ మామునూరుకు చెందిన నోముల వెంక‌ట్‌రెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు రామ‌చంద్రారెడ్డి, చిన్నకొడుకు పాపిరెడ్డిల‌కు చెరో ఏడున్నర ఎక‌రాల భూమిని పంచి ఇచ్చారు. ఇందులో భాగంగానే మామునూరు జాతీయ ర‌హ‌దారిపై ఉన్న 337/ సిలోని 26గుంట‌ల భూమి రామ‌చంద్రారెడ్డికి, 337/డిలోని 26 గుంట‌ల భూమి పాపిరెడ్డికి వార‌స‌త్వంగా వ‌చ్చింది. దీంతో పాటు మామునూరులోని కోట‌క‌ట్ట ప్రాంతంలోని 193/బిలోని 34గుంట‌లు, 191/ సిలో 10 గుంట‌ల భూమి పాపిరెడ్డికి వార‌స‌త్వంగా వ‌చ్చింది.

తండ్రుల‌ మ‌ధ్య భూ మార్పిడి ఒప్పందం కానీ..

తండ్రి నుంచి వార‌స‌త్వంగా వ‌చ్చిన భూమిని మార్పిడి చేసుకోవాల‌ని భావించిన అన్నద‌మ్ములైన రామ‌చంద్రారెడ్డి పాపిరెడ్డిలు నోటి మాట‌గా స‌యోధ్య కుదుర్చుకున్నారు. 193/డిలోని 34గుంట‌లు, 191/ బిలో 10 గుంట‌ల భూమిని రామ‌చంద్రారెడ్డి సాగు చేసుకునేలా, రోడ్డుకు ద‌గ్గరగా ఉన్న 337/ సిలోని 26గుంట‌ల భూమిని పాపిరెడ్డి సాగు చేసుకునేలా నోటిమాట‌గా అనుకున్నారు. రామ‌చంద్రారెడ్డి, పాపిరెడ్డిలు త‌ద‌నంన‌త‌ర కాలంలో వారి వారసులైన శ్రీనివాస‌రెడ్డి - తిరుప‌తిరెడ్డిలు కూడా ఇదే విధంగా సాగు చేసుకున్నారు.


అయితే 2016లో తిరుప‌తిరెడ్డి త‌మ తాత పంపిణీ చేసిన విధంగానే భూమి ఇవ్వాల‌ని కోర్టుకెక్కాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ర‌ద్దు చేసుకున్నాడు. అయితే 337/ సిలోని 26గుంట‌ల భూమితో పాటు తాను సాగు చేసుకున్న 193/డిలోని 34గుంట‌లు, 191/ బిలో 10 గుంట‌ల భూమిపై ప‌ట్టా పొందాడు. గ‌తంలో తాత పంపిణీ చేసిన విధంగా గాని, బాబాయ్ పాపిరెడ్డి, తండ్రి రామ‌చంద్రారెడ్డిల మ‌ధ్య కుదిరిన ఏ ఒప్పందానికి కాకుండా మొత్తం భూమిని కాజేయ‌డానికి తిరుప‌తిరెడ్డి య‌త్నిస్తున్నాడంటూ శ్రీనివాస‌రెడ్డి ఆరోపిస్తున్నారు.

కోర్టు ఆదేశాలు బేఖాతార్‌..!

పూర్వీకుల నుంచి వ‌స్తున్న 26గుంట‌ల భూమిపై త‌మ‌కు తెల్వకుండా కొంత‌మంది అధికారుల స‌హ‌కారంతో తిరుప‌తిరెడ్డి ప‌ట్టా పొందాడ‌ని శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నారు. 2020 వ‌ర‌కు తామూ పంట‌కాలంలో త‌న పేరు ఉంద‌ని, ఇదే సాక్ష్యంతో తాను కోర్టుకు వెళ్లడం జ‌రిగింద‌ని తెలిపారు. దీనిపై తాము స్టేట‌స్ కో ఆర్డర్ కూడా తెచ్చుకోవ‌డం జ‌రిగింద‌ని తెలిపారు.


అయితే కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ బేఖాతార్ చేస్తూ స‌ద‌రు భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాడ‌ని తెలిపారు. ఇదే విష‌యంపై గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ కాశిబుగ్గ స‌ర్కిల్ కార్యాల‌యంలోని అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారికి ఫిర్యాదు కూడా చేశామ‌ని, అధికారులు నోటీసులు జారీ చేసినా కూడా తిరుప‌తిరెడ్డి త‌న రాజ‌కీయ బ‌లంతో ముందుకెళ్తున్నాడ‌ని ఆరోపించారు.

Next Story

Most Viewed