ICICI Bank: ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ బ్యాంక్!

by Disha Web Desk 17 |
ICICI Bank Hikes Interest Rates On Fixed Deposits
X

న్యూఢిల్లీ: ICICI Bank Hikes Interest Rates On Fixed Deposits| దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇప్పటికే పలు బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచగా, తాజాగా ఈ జాబితాలో ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కూడా చేరింది. రూ. 5 కోట్ల కంటే తక్కువ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ)పై వడ్డీ రేట్లు పెంచుతున్నామని, సవరించిన రేట్లు గురువారం నుంచే అమల్లోకి రానున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.

బ్యాంకు వివరాల ప్రకారం, 7-14 రోజుల ఎఫ్‌డీలపై 2.75 శాతం, 14-29 రోజుల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీని 3.25 శాతం పెంచారు. 30-90 రోజుల కాలవ్యవధి ఉన్న ఎఫ్‌డీలపై 3.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.75 శాతం వడ్డీ లభిస్తుంది. 91-184 రోజుల ఎఫ్‌డీలపై సాధారణ ఖాతాదారులకు 3.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.25 శాతం వడ్డీ రేటు అమలు కానుంది. 185-ఏడాది కాలవ్యవధి ఉన్న ఎఫ్‌డీలపై సాధారణ ఖాతాదారులకు 4.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.10 శాతం వడ్డీ లభిస్తుంది. 1-2 ఏళ్ల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై సాధారణ ఖాతదారులకు 5.30 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.80 శాతం చొప్పున వడ్డీ అందుతుంది.

2-3 ఏళ్ల ఎఫ్‌డీలపై సాధారణ ఖాతాదారులకు 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నట్టు బ్యాంకు తెలిపింది. ఇక, 3-5 ఏళ్ల ఎఫ్‌డీలపై సాధారణ ఖాతాదారులకు 5.70 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.20 శాతం, 5-10 ఏళ్ల కాలానికి సాధారణ ఖాతాదారులకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం వడ్డీ లభించనుంది.


Next Story