ఒకరికొకరు అండగా.. ఏకమవుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌లు

by Disha Web Desk |
ఒకరికొకరు అండగా.. ఏకమవుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : అధికార పార్టీ రాజకీయాలు, ప్రభుత్వ పాలనా యంత్రాంగం కొన్ని అంశాల్లో కలగలిసిపోవడంతో విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకుంటున్నాయి. బీహారీల రాజ్యం నడుస్తున్నదంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి చెందిన పూర్వీకులు కావడంతో పరిపాలనలోనూ ఆ రాష్ట్రానికి చెందినవారికే ప్రాధాన్యత లభిస్తున్నదంటూ కామెంట్ చేయడంతో వారి తరఫున ఐఏఎస్ అధికారులంతా ఒక్కటయ్యారు. డీజీపీ మహేందర్‌రెడ్డిపైనా రేవంత్ సెటైర్లు వేయడంతో ఐపీఎస్ అధికారులంతా ఒక్కటయ్యారు. ఇప్పుడు మంత్రి శ్రీనివాసగౌడ్‌పై హత్యకు కుట్ర జరిగిందంటూ పోలీసులు సంచలన అంశాన్ని తెరపైకి తేవడంతో ఉద్యోగ సంఘాలు ఒక్కటయ్యాయి.

తెలంగాణ ప్రభుత్వంలో బీహార్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారుల పెత్తనం నడుస్తోందని, ఎక్కువ ప్రాధాన్యత లభిస్తున్నదంటూ రేవంత్ ఇటీవల కామెంట్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులు సొంత రాష్ట్రంలో గుర్తింపుకు నోచుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారుల సంఘం ఈ వ్యాఖ్యలను వెంటనే ఖండించింది. అఖిల భారత సర్వీసు అధికారులుగా ఉన్నందున నిర్దిష్ట నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తున్నామని, రాజకీయాలతో ముడిపెట్టి ఫలానా రాష్ట్రానికి చెందినవారంటూ ముద్ర వేయడం వాంఛనీయం కాదని, రాజకీయాలతో ముడిపెట్టడం సమంజసం కాదని సంఘం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఇలాంటి వివక్షతో కూడిన ప్రకటనలతో విధి నిర్వహణలో ఆ రాష్ట్రానికి చెందిన అధికారులు నైతిక స్థయిర్యాన్ని కోల్పోతారని, ఇక నుంచి రాజకీయ నాయకులు అలాంటి కామెంట్లకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

డీజీపీ మహేందర్ రెడ్డి విషయంలోనూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఐపీఎస్ అధికారుల సంఘం స్పందించింది. బీహార్ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారికి ప్రాధాన్యత ఇవ్వడం కోసం మహేందర్ రెడ్డిని ప్రభుత్వమే లీవ్ మీద పంపించిందంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని సంఘం తప్పుపట్టింది. ఐపీఎస్ పూర్తిచేసిన అధికారులను కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు అలాట్ చేస్తుందని, రాజకీయ ప్రయోజనాల కోసం అధికారులను ఈ వివాదంలోకి లాగడం సరికాదని వ్యాఖ్యానించింది. మహేందర్ రెడ్డి లీవ్ మీద వెళ్ళడానికి నిజమైన కారణం ఆయన అనారోగ్యమేనని, దీనికి విరుద్దంగా కామెంట్లు చేయడం బాధ్యతారాహిత్యమేనని వ్యాఖ్యానించింది. ఇలాంటి కామెంట్లు విధి నిర్వహణలో ఉన్న అధికారుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీస్తుందని, ఇకపైన ఇలాంటివాటికి దూరంగా ఉండాలని సూచించింది.

ఈ రెండు సంఘాల ప్రకటనలపై ఆ తర్వాత కూడా రేవంత్ స్పందించారు. ఈ రెండు సంఘాలకు చెందిన అధికారులు కూడా బీహార్ రాష్ట్రానికి చెందినవారి చేతుల్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. డీజీపీ మహేందర్ రెడ్డి ఒత్తిడితోనే ఐపీఎస్ అధికారుల సంఘం ప్రకటన విడుదల చేయాల్సి వచ్చిందన్నారు. ఈ రెండు కాకుండా మిగిలిన అధికారులు ఎందుకు తన వ్యాఖ్యలను తప్పుపట్టడంలేదన్న అంశాన్ని లేవనెత్తారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, 'అతి'కి పాల్పడుతున్న అధికారుల సంగతి చూస్తామని హెచ్చరించారు. ఉద్యోగ సంఘాలన్నీ ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నాయని ఆరోపించారు. నిజానికి మహేందర్ రెడ్డిని పక్కన పెట్టి ఇన్‌చార్జిగా కొత్త వ్యక్తిని నియమించినప్పుడే ఇలాంటిది ఏదో జరుగుతుందని తాను గ్రహించానని గుర్తుచేశారు.

ఈ రెండూ కొనసాగుతున్న సమయంలోనే మంత్రి శ్రీనివాసగౌడ్‌పై హత్యకు కుట్ర జరిగిందంటూ సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సంచలన అంశాన్ని తెరపైకి తేవడంతో మంత్రికి అండగా ఉద్యోగ సంఘాలన్నీ ఏకమయ్యాయి. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘానికి గౌరవాధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసగౌడ్‌కు మద్దతుగా ఆ సంఘానికి చెందినవారంతో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ విధులు నిర్వర్తిస్తామని ఆ సంఘం అధ్యక్షురాలు మమత వ్యాఖ్యానించారు. హత్యకు కుట్రపన్నినవారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఇన్‌చార్జి డీజీపీ అంజనీకుమార్‌కు మెమొరాండం సమర్పించారు.

తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం కూడా శ్రీనివాసగౌడ్‌కు మద్దతు పలికింది. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన శ్రీనివాసగౌడ్‌పై హత్యకు కుట్ర పన్నడం దురదృష్టకరమని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నేతలు కూడా మంత్రికి అండగా నిలిచారు.

Next Story