త్వరలో సెబీకి ఎల్ఐసీ ఐపీఓ తుది పత్రాల సమర్పణ!

by Disha Web Desk 17 |
త్వరలో సెబీకి ఎల్ఐసీ ఐపీఓ తుది పత్రాల సమర్పణ!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీఓకు ఇటీవలే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఆమోదం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే త్వరలో దీనికి సంబంధించిన తుది పత్రాలను సమర్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పత్రాల్లో సంస్థ లిస్టింగ్‌కు అవసరమైన ధరతో పాటు పాలసీదారులకు వర్తించే రాయితీ, వివిధ వర్గాలకు కేటాయించే షేర్ల వాటాకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. అయితే, గత నెలాఖరులో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఇప్పటికీ ఒడిదుడుకుల మధ్య ట్రేడింగ్ జరుగుతున్న సమయంలో స్టాక్ మార్కెట్ల పరిస్థితులను బట్టి ఎల్ఐసీ ఐపీఓను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

కాగా, ఎల్ఐసీ ఐపీఓకు అన్ని ప్రక్రియలు వేగవంతంగా జరుగుతున్న తరుణంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను శుక్రవారం వెల్లడించింది. సమీక్షించిన త్రైమాసికంలో ఎల్ఐసీ రూ. 234.91 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంలో సంస్థ రూ. 90 కోట్ల లాభాలను నమోదు చేసింది. సర్‌ప్లస్ డిస్ట్రిబ్యూషన్ మోడల్‌లో తెచ్చిన మార్పుల కారణంగానే లాభాలు గణనీయంగా పెరిగాయని సంస్థ పేర్కొంది. అదేవిధంగా 2021-22 ఏప్రిల్-డిసెంబర్ మధ్య మొత్తం రూ. 1,642.78 కోట్ల లాభాలు నమోదు చేసింది.


Next Story