అక్కడ మూత.. ఇక్కడ గేటు బయట.. ఆ జిల్లాలో తెరుచుకొని బడులు

by Disha Web Desk 12 |
అక్కడ మూత.. ఇక్కడ గేటు బయట.. ఆ జిల్లాలో తెరుచుకొని బడులు
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : అక్షరాస్యతలో అట్టడుగున ఉన్న జోగులాంబ గద్వాల జిల్లాలో సర్కారు బడుల పనితీరు అగమ్య గోచరంగా తయారయింది. సకాలంలో ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరు కాక ఒక చోట.. ఉన్న ఒక ఉపాధ్యాయుడు శిక్షణ కోసం వెళ్లడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని కారణంగా మూతపడ్డాయి.. వివరాల్లోకి వెళితే జోగులాంబ గద్వాల మండలం జిల్లేడు బండ గ్రామ ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులు ఉండగా ఒకే ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్నాడు. ఆ ఉపాధ్యాయుడు సెలవులో ఉన్న.. శిక్షణకు వెళ్లిన ఆ పాఠశాల మూత పడుతుందని గ్రామస్తులు.. తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శనివారం ఉన్న ఒక ఉపాధ్యాయుడు శిక్షణకు వెళ్లడంతో ఆ పాఠశాల మూత పడింది.

కాగా వడ్డేపల్లి మండలం లోని కుంకాల గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఎనిమిది గంటలు దాటిన విద్యార్థులు గేటు బయట ఉండిపోవాల్సి వచ్చింది. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సకాలంలో హాజరు కాకపోవడం వల్ల విద్యార్థులు గేటు బయట ఉండిపోవాల్సివచ్చింది. జిల్లాలో చాలా పాఠశాలల్లో ఇదే విధమైన పరిస్థితులు ఉన్నట్లు సమాచారం. కరోనా కారణంగా అంతంత మాత్రంగానే సాగిన ఈ విద్యా సంవత్సరం ఉపాధ్యాయులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు మరింత నష్టపోవాల్సినా పరిస్థితులు నెలకొంటున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారిని వివరణ కోరగా అందుకు సంబంధించిన సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు.

Next Story