బలవంతంగా యూరిన్‌ ఆపుతున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్టే!

by Disha Web Desk |
బలవంతంగా యూరిన్‌ ఆపుతున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్టే!
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఏదైనా పనిమీద బయటి ప్రాంతాలకు వెళ్లేవారు పబ్లిక్ రెస్ట్‌రూమ్స్ యూజ్ చేసేందుకు సంకోచిస్తారు. లేదంటే వాష్‌ రూమ్‌ దూరంగా ఉంది, తర్వాత వెళ్దాంలే అనుకుంటూ ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకుంటారు. కానీ అలా చేస్తే అనారోగ్యాలను ఆహ్వానించినట్లేనని నిపుణులు సూచిస్తున్నారు. వాటి వల్ల కలిగే దుష్ర్పభావాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

ఎక్కువసేపు బిగపట్టుకోవడం వల్ల కలిగే అనర్థాలు :

కిడ్నీ స్టోన్ : శరీరంలోని వ్యర్థ పదార్థాలు గట్టి పడినప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. అశ్రద్ధ వహిస్తే వాటి పరిమాణం పెరిగి మూత్రనాళంలో అడ్డంకులు సృష్టిస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్‌కు కారణమవడంతో పాటు మూత్రనాళ గోడలను చీల్చి రక్తస్రావాన్ని కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. నీరు చాలా తక్కువగా తాగడం, మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడమే ఇందుకు ప్రధాన కారణాలు. అందుకే ఎప్పటికప్పుడు మూత్ర విసర్జన చేస్తే అనారోగ్యం బారిన పడకుండా ఉండవచ్చు.

యూరిన్ ఇన్ఫెక్షన్ :

సహజంగా మూత్ర నాళంలో బాక్టీరియా ఉంటుంది. అది బయటకు పోవాలంటే ఖచ్చితంగా మూత్రవిసర్జన చేయల్సిందే. ఒకవేళ ఎక్కువ సేపు మూత్రవిసర్జన చేయకుండా ఆపుకుంటే ఆ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఫలితంగా మూత్ర నాళంలోని ఏదైనా భాగంలో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. అంతేకాదు ఈ UTI(యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్) చాలా బాధాకరమైనవి. ఒకసారి ప్రేరేపించబడితే మళ్లీ సంభవించవచ్చు.

మూత్రాశయం పగిలిపోవచ్చు :

ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది. యూరిన్‌ను ఎక్కువ సమయం ఆపుకున్నప్పుడు మూత్రాశయం పగిలిపోయే చాన్స్ ఉంది. ఇలా జరిగితే ఉదరం నిండా యూరిన్ వ్యాపిస్తుంది. దీంతో పాటు ఎక్కువసేపు బిగపట్టుకుని సాగదీయడం వల్ల మూత్రాశయం బలహీనపడుతుంది. విపరీతమైన నొప్పికి కూడా కారణమవుతుంది.

నియంత్రణ కోల్పోతారు :

ప్రతిసారి ఇలాగే మూత్రాన్ని ఆపుకోవడం వల్ల పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనపడతాయి. దీర్ఘకాలికంగా బ్లాడర్‌పై నియంత్రణ కోల్పోతారు. ఇది ఆపుకొనలేని స్థితికి దారి తీసి ఇబ్బందికరమైన సమస్యగా మారుతుంది.

ఈ సమస్య కారణంగా ఒత్తిడికి గురయ్యే మరో అవయవం కిడ్నీ. మూత్రాన్ని ఆపుకోవడం వల్ల కిడ్నీలు ఫెయిల్‌ అయ్యే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

కనీసం 2 గంటలకు ఒకసారైనా మూత్ర విసర్జన చేస్తే మంచిదని సూచిస్తున్నారు.

Next Story

Most Viewed