ప్రైవేటు ఆస్తి స్వాధీనంలో ప్రభుత్వ కీలక విధులను వివరించిన సుప్రీంకోర్టు

by Gopi |
ప్రైవేటు ఆస్తి స్వాధీనంలో ప్రభుత్వ కీలక విధులను వివరించిన సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రైవేట్ ఆస్తిని స్వాధీనం చేసుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల విధిని భారత అత్యున్నత న్యాయస్థానం గుర్తుచేసింది. ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను సమాజ వనరులుగా పరిగణించొచ్చా అన్న అంశంపై తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి మహారాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్ట సవరణపై కోర్టు స్పందిస్తూ.. భారత రాజ్యాంగం ప్రకారం, న్యాయపరమైన విధానాలకు కట్టుబడి ఆస్తి యజమానుల హక్కులను కాపాడాల్సిన ఆవశ్యకతను ఎత్తిచూపుతూ, ప్రైవేట్ ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ముందు అవసరమైన రాజ్యాంగ భద్రతలను పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఏ వ్యక్తి స్థిరాస్తిని స్వాధీనం చేసుకోవాలన్నా న్యాయపరమైన చట్ట ప్రక్రియను అనుసరించాలని పేర్కొంది. ఆర్టికల్ 300ఏ ప్రకారం చట్టానికి ఉన్న అధికారం ద్వారా తప్ప ఏ వ్యక్తీ అతని ఆస్తిని కోల్పోకూడదని వెల్లడించింది. ప్రజా ప్రయోజనాల కోసం, నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తిని స్వాధీనం చేసుకున్నప్పుడు విధానపరమైన ఆర్టికల్ 300ఏ మూలస్తంభమని కోర్టు అభిప్రాయపడింది.

స్వాధీన ప్రక్రియలో న్యాయబద్దత, పారదర్శకత, సహజ న్యాయం, స్వాధీన ప్రక్రియలో అధికారాన్ని ఏకపక్షంగా వినియోగించకపోడం వంటి అంశాలు కీలకమని జస్టిస్ నరసింహ తెలిపారు. ఈ సందర్భంగా ఏదైనా ఆస్తి స్వాధీనానికి ముందు తప్పనిసరిగా పాటించాల్సిన ఏడు ప్రాథమిక విధానపరమైన హక్కులను కోర్టు వివరించింది. ఇందులో వ్యక్తికి చెందిన ఆస్తి స్వాధీనం గురించి తెలుసుకునే హక్కు, వినే హక్కు, సమాచార నిర్ణయానికి హక్కు, న్యాయమైన పరిహారం పొందే హక్కు ఉంటుంది. ప్రభుత్వం తరపున, ప్రజా ప్రయోజనం కోసమే స్వాధీనం చేసుకోవాలని, నిర్ణీత గడువులోగా కొనుగోలు ప్రక్రియను చేపట్టడం, చివరగా ముగింపు హక్కు. ఇది సరైన పద్దతిలో ఆస్తి స్వాధీన ప్రక్రియను ముగించాలని వెల్లడించింది.

Next Story