పార్కింగ్ కోసం ఫుట్ పాత్ తొలగింపు ..పట్టించుకోని జీహెచ్ఎంసీ

by Disha Web Desk 12 |
పార్కింగ్ కోసం ఫుట్ పాత్ తొలగింపు ..పట్టించుకోని జీహెచ్ఎంసీ
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్ పాత్‌లను కొందరు ప్రైవేట్ వ్యక్తులు కూల్చివేసి ఆక్రమించుకుంటున్నా మహా నగర పాలక సంస్థ అధికారులు చోద్యం చూస్తున్నారు. హైదరాబాద్ నగరంలో నిరంతరం ట్రాఫిక్ అధికంగా ఉండే ప్రాంతాల్లో పాదచారులు నడిచేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఇవి చాలా చోట్ల చిరు వ్యాపారులు ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తుండడం అంతటా చూస్తుంటాం. వారిని కట్టడి చేయడం ట్రాఫిక్ పోలీసులకు తలకు మించిన భారం గా మారుతోంది. ఫుట్ పాత్ ఆక్రమించే వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ చేయడం, కేసులు నమోదు చేయడం వంటివి కూడా చేస్తున్నారు. ఇంత చేసినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. వారిని మార్చేందుకు ట్రాఫిక్ అధికారులు చేస్తున్న ప్రయత్నం జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతోంది.

సొంత వ్యాపారం కోసం ఫుట్ పాత్ కూల్చివేత..

ప్రతినిత్యం ట్రాఫిక్‌తో ఎంతో రద్ధీగా ఉండే కోఠిలో ఓ మెడికల్ షాప్ నిర్వాహకులు తమ దుకాణం ముందు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఫుట్ పాత్‌లను తమ దగ్గరికి వచ్చే వారి వాహనాల పార్కింగ్ కోసం రాత్రికి రాత్రే తొలగించారు. దుకాణం ముందు చాదర్ ఘాట్ నుండి కోఠి కి వెళ్లే ప్రధాన రహదారి ఉండడంతో పాదచారులు రోడ్లపై నడవాల్సి వస్తుంది. అంతేకాకుండా సమీపంలోనే మహిళా కళాశాల ఉంది. కాలేజ్‌కు వెళ్లే విద్యార్థినులకు కూడా ఫుట్ పాత్ తొలగింపుతో సమస్యలు తలెత్తనున్నాయి.

ఇబ్బందులను పట్టించుకోకుండా మరో అడుగు ముందుకు వేసి ఫుట్ పాత్‌లను తొలగించాలని ఈ నెల 2వ తేదీన జీహెచ్ఎంసీ సర్కిల్ - 14 ఈ ఈ కి మెడికల్ షాప్ నిర్వాహకులు దరఖాస్తు కూడా పెట్టారు. అయితే అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు రానప్పటికీ రాత్రికి రాత్రే ఫుట్ పాత్‌ను తొలగించారు. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో సొంత లాభం కోసం ఇలా చేయడాన్ని ఇసామియా బజార్ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుని ఫుట్ పాత్ ను తొలగించిన దుకాణాదారుని పై చర్యలు తీసుకుని తిరిగి నిర్మించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



Next Story

Most Viewed