కేజీబీవీలో మరో 15 మందికి ఫుడ్ పాయిజన్.. అధికారులు సస్పెండ్!

by Disha Web Desk 13 |
కేజీబీవీలో మరో 15 మందికి ఫుడ్ పాయిజన్.. అధికారులు సస్పెండ్!
X

దిశ, అదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోనే కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ తో గురువారం మరో 15 మంది విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన అధికారులు కేజీబీవీ లో స్పెషల్ ఆఫీసర్, ఏఎన్ఎం, యూపిపిఎస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలను సస్పెండ్ చేస్తూ.. జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత ఉత్తర్వులను జారీ చేశారు.

జిల్లా కేంద్రంలోని విద్యా నగర్ కాలనీలో గల కేజీబీవీ హాస్టల్ లో బుధవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ తిన్న 30 మంది విద్యార్థులు, అలాగే తాంసీ మండలం గోటుకోరి యూపిపిఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 28 మంది విద్యార్థులు వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.. గురువారం ఉదయం అదే కేజీబీవీ హాస్టల్ లో మరో 15 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. వీరందరూ ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత రిమ్స్ కు చేరుకొని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని వారి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.

ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశం..

ఆహార నియంత్రణ అధికారులు కేజీబీవీ హాస్టల్ కు వెళ్లి ఆహారంతోపాటు బోరు నీళ్లను ల్యాబ్ కు తరలించారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఎన్ఎం పద్మ, స్పెషల్ ఆఫీసర్ హిమబిందు తో పాటు గోటుకోరి యూపిపిఎస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శోభారాణి లను జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. కేజీబీవీ హాస్టల్ లో గతంలో విద్యార్థులకు మినరల్ వాటర్ కొనుగోలు చేసి ఇచ్చేవారు. హాస్టల్ లో ఉన్న బోర్ వాటర్ ను ల్యాబ్‌లో పరీక్ష చేయగా.. మినరల్ వాటర్ కు బదులు, బోర్ వాటర్ ను విద్యార్థులకు ఇవ్వవచ్చని ల్యాబ్ నివేదిక ఆధారంగా గత నెల రోజులుగా విద్యార్థులకు ఈ బోర్ వాటర్ ఇస్తున్నారు. ఈ కలుషిత వాటర్ తాగడం వల్లనే తమకు వాంతులు విరోచనాలు అవుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed