సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ నంబర్ వన్.. 136వ స్థానంలో భారత్

by Disha Web Desk 17 |
సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ నంబర్ వన్.. 136వ స్థానంలో భారత్
X

హెల్సింకి: ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ వరుసగా ఐదోసారి మొదటి స్థానాన్ని దక్కించుకోగా, ఆఫ్ఘనిస్థాన్ మరోసారి చిట్ట చివరి స్థానంలో నిలిచింది. వరల్డ్ వైడ్ హ్యాపియెస్ట్ కంట్రీస్‌కు సంబంధించిన 10వ వార్షిక నివేదికను యునైటెడ్ నేషన్స్ శుక్రవారం విడుదల చేసింది. మార్చి 20వ తేదీన 'ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్' సందర్భంగా రెండు రోజుల ముందు యూఎన్ ఈ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం ఫిన్లాండ్ మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోగా ఆ తర్వాతి స్థానాల్లో డెన్మార్క్, ఐస్ లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఉన్నాయి. మొత్తంగా 146 దేశాల్లో వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్న యూఎన్ ఈ వార్షిక నివేదికను విడుదల చేయగా చిట్టచివరి స్థానాల్లో ఆఫ్ఘనిస్తాన్ తర్వాత లెబనాన్, జింబాబ్వే, రువాండా, బోట్స్వానా వంట దేశాలు నిలిచాయి.

ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలవబడుతున్న భారత్ సంతోషకరమైన దేశాల జాబితాలో 136వ స్థానాన్ని కైవసం చేసుకుంటే, దాయాది పాకిస్తాన్ మనకంటే మెరుగ్గా 121వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో అమెరికా 3 స్థానాలు ఎగబాకి 16వ స్థానానికి చేరుకోగా, ఆ తర్వాతి స్థానంలో బ్రిటన్ నిలిచింది. ఇక ఫ్రాన్స్ 20వ స్థానాన్ని దక్కించుకుంది. రష్యాతో బోర్డర్‌ను పంచుకుంటున్న ఫిన్లాండ్ హ్యాపియెస్ట్ దేశాల జాబితాలో తొలి స్థానంలో నిలిస్తే రష్యా మాత్రం 80వ స్థానంలో నిలిచింది.

కాగా, దేశంలో సంతోషకరమైన వాతావరణానికి స్మార్ట్ అర్బన్ ప్లానింగ్, ఒత్తిడిని తగ్గించేందుకు, శారీరక శ్రమను ప్రోత్సహించేందుకు గ్రీనరీ ప్రదేశాలకు ప్రాధాన్యత కల్పించడం, ప్రగతిశీల పన్నుల విధానం, సమర్థవంతమైన ప్రభుత్వ వ్యవస్థ, బలమైన ఆరోగ్య సంరక్షణ, విద్యా వ్యవస్థలు, దేశ జీడీపీ, నేరాల నియంత్రణ వంటి అంశాలను ఆధారంగా తీసుకుని ఈ నివేదికను రూపొందించినట్టు హెల్సింకి ఆధారిత ఆల్టో విశ్వవిద్యాలయంలోని నిపుణులు వెల్లడించారు.



Next Story

Most Viewed