రేవంత్ ఆపరేషన్ సక్సెస్.. కాంగ్రెస్ గూటికి మాజీ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు?

by Disha Web Desk 4 |
రేవంత్ ఆపరేషన్ సక్సెస్.. కాంగ్రెస్ గూటికి మాజీ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: అధికార టీఆర్​ఎస్​ పార్టీ బీజేపీ శ్రేణులపై ఫోకస్​ చేస్తే.. ప్రతిపక్ష కాంగ్రెస్​ అధికారపక్షంపై కన్నేసింది. గులాబీ నేతలను టార్గెట్​ చేస్తోంది. బీజేపీకి చెందిన కీలక నేతలు ఈటల రాజేందర్​, పార్టీలో చేరుతున్న కొండా విశ్వేశ్వర్​ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్​ కు వస్తారంటూ బహిరంగంగానే ప్రచారం చేస్తున్న హస్తం నేతలు.. టీఆర్​ఎస్​ కు చెందిన కీలక నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అధికారంలో ఉన్న వారు కూడా కొంతమంది విపక్షంలో చేరుతున్నారు. ప్రస్తుతం టీఆర్​ఎస్​ మొత్తం బీజేపీని టార్గెట్​ గా పెట్టుకుంటే.. ఇదే అదునుగా కాంగ్రెస్​ అంచనా వేస్తోంది. దీంతో టీపీసీసీ చీఫ్​ రేవంత్​ సహా కీలక నేతలు గులాబీ నేతలపై దృష్టి పెట్టారు. గ్రేటర్​ హైదరాబాద్​లోని కార్పొరేటర్లను సైతం పార్టీకి తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నాలే జరుగుతున్నాయి. అంతేకాకుండా సిటీ శివారు నియోజకవర్గాలకు చెందిన వారు కూడా కాంగ్రెస్​ వైపు చూస్తున్నారు.

ఇటీవల పెరిగిన వలసలు

కాంగ్రెస్‌లోకి ఇటీవల చేరికలు పెరిగాయి. మంచిర్యాల జెడ్పీ చైర్​ పర్సన్​ నల్లాల భాగ్యలక్ష్మీ, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు హస్తం గూటికి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఖైరతాబాద్​ కార్పొరేటర్​ విజయారెడ్డితో సహా పలువురు చేరారు. బీజేపీ నుంచి కూడా బోడ జనార్ధన్​, టీఆర్​ఎస్​ కు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. ఈ పరిణామాలు కాంగ్రెస్​ లో జోష్​ పెంచాయి. అనంతరం ఖమ్మం జిల్లా నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో, మంచిర్యాల నుంచి ప్రేంసాగర్​ రావు ఆధ్వర్యంలో వలసలు కొనసాగాయి. తాజాగా బడంగ్​పేట మేయర్​ పారిజాతా నర్సింహారెడ్డి కాంగ్రెస్​ లో చేరేందుకు సిద్ధమయ్యారు. రేవంత్​ రెడ్డితో భేటీ కూడా అయ్యారు. ముందుగా కాంగ్రెస్​ నుంచి గెలిచిన పారిజాతను టీఆర్​ఎస్​ లోకి తీసుకుని మేయర్​ చేశారు. మేయర్​ పారిజాత మాత్రమే కాకుండా కొంతమంది కార్పొరేటర్లు కూడా వెంట వచ్చే అవకాశాలున్నాయి. మీర్​పేట కార్పొరేషన్​ మేయర్​ కూడా త్వరలోనే కాంగ్రెస్​ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మాజీలపై ఫోకస్​

టీఆర్​ఎస్​ లో అంతర్గత విభేదాలను కాంగ్రెస్​ అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి మెదక్​ జిల్లాకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్​ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి తొలిసారి గెలిచి, రెండోసారి ఓడిపోయిన సదరు మాజీ ఎమ్మెల్యే.. తన కుమారుడితో సహా హస్తంలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్​ రెడ్డితో చర్చలు కూడా పూర్తయ్యాయి. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతో పాటుగా.. ఓ మాజీ ఎమ్మెల్సీ కూడా హస్తానికి చిక్కారు. కొంతకాలం కిందటి వరకు ప్రగతిభవన్​ లో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్సీకి ఇటీవల టీఆర్​ఎస్​ పెద్దలతో గ్యాప్​ వచ్చింది. అంతేకాకుండా ఓ కాంట్రాక్ట్​ విషయంలో ఆయనను అధికారులు ఇరుకున పెడుతున్నా.. టీఆర్​ఎస్​ అధిష్టానం నుంచి స్పందన రావడం లేదు. వంద కోట్ల బిల్లు ఆగి ఏడాదిన్నర గడుస్తున్నా.. ఇప్పించడం లేదని సమాచారం. అంతేకాకుండా పనుల్లో నాణ్యత లేదని సదరు మాజీ ఎమ్మెల్సీపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్​ నేతలకు టచ్​ లోకి వచ్చారు. త్వరలోనే ఆయన కూడా పార్టీలో చేరుతారని భావిస్తున్నారు.

మరోవైపు కొల్లాపూర్​ సెగ్మెంట్​లో విభేదాలు రోడ్డెక్కాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అదును చూసి టీఆర్​ఎస్​ ను వీడుతారని పార్టీ అధిష్టానం కూడా భావిస్తోంది. కొల్లాపూర్​ లో విభేదాలు రోడ్డెక్కిన తర్వాత ఆయన మంత్రి కేటీఆర్​ ను కలిసేందుకు హైదరాబాద్​ కు వస్తే కనీసం ప్రగతిభవన్​ గేటు కూడా దాటనీయలేదు. అక్కడ గంటల తరబడి ఎదురుచూసి వెనుదిరిగినట్లు పార్టీ వర్గాల్లో చర్చ. ఈ సమయాన్ని అందుకున్న రేవంత్​ సన్నిహితులు జూపల్లితో చర్చలు పెట్టారు. తిరిగి సొంత గూటికి రావాలని ఆహ్వానించారు. రేవంత్​ రెడ్డితో కూడా మాట్లాడించినట్లు సమాచారం. జూపల్లి ఇంకా ఏ పార్టీలో చేరుతారో స్పష్టత లేకున్నా.. కాంగ్రెస్​ లోకే వస్తారని అంచనా వేస్తున్నారు.

టార్గెట్​ టీఆర్​ఎస్​

ప్రస్తుతం టీఆర్​ఎస్​ ఏకైక లక్ష్యం బీజేపీపైనే పెట్టింది. ఇదే అదునుగా కాంగ్రెస్​ ఆ పార్టీ నేతలను టార్గెట్​ గా పెట్టుకుంది. విపక్షాల నుంచి అధికారపక్షంలోకి వెళ్లడం సాధారణమే అయినప్పటికీ.. తాజాగా ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్​ లోకి అధికారంలో ఉన్న నేతలు వస్తున్నారు. దీంతో కాంగ్రెస్​ పార్టీలోకి వెళ్లేందుకు అవకాశం కోసం చూస్తున్నవారి జాబితా పెరుగుతోంది. గ్రేటర్​ తో పాటుగా కీలకమైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో నుంచి కాంగ్రెస్​ లోకి వచ్చేవారున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.మరోవైపు నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలపై కాంగ్రెస్​ గురి పెట్టింది. సిట్టింగ్​ లు ఉన్న నియోజకవర్గాల్లో టికెట్​ మార్చడం కష్టమేనంటూ ప్రచారం చేస్తోంది. దీంతో ద్వితీయ శ్రేణి నేతలను తమవైపు తిప్పుకునేందుకు ప్లాన్​ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్​ నుంచి టీఆర్​ఎస్​ లోకి వెళ్లిన వారిని తిరిగి తీసుకురానున్నారు.

టికెట్​ హామీ

పార్టీలోకి వచ్చేవారికి కొన్నిచోట్ల టికెట్​ ఇప్పిస్తామనే హామీ కూడా ఇస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇటీవల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరికలు చేసిన విషయం విదితమే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్​ కోసమే కొంతమంది కాంగ్రెస్​లోకి వస్తున్నట్లు గాంధీభవన్​ లో ప్రచారం జరుగుతున్ననేపథ్యంలో పార్టీ సీనియర్లు దీనిపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎల్పీ నేత భట్టి ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. పార్టీలోకి టికెట్​ కోసం వచ్చేవారు రావద్దనే సంకేతాలిచ్చారు. కానీ, టీపీసీసీ చీఫ్​ నుంచి కొంతమందికి స్పష్టమైన హామీ ఇస్తున్నారని, అందుకే పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు.


Next Story

Most Viewed