మూడు రెట్లు పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు

by Disha Web |
మూడు రెట్లు పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు
X

న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల రిటైల్ అమ్మకాలు అంతకుముందు కంటే మూడు రెట్లు పెరిగాయని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది. ప్రధానంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అత్యధిక అమ్మకాలకు గణనీయంగా దోహదపడ్డాయని ఫాడా పేర్కొంది. సమీక్షించిన కాలంలో మొత్తం 4,29,217 యూనిట్లు విక్రయించబడ్డాయి. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన 1,34,821 యూనిట్ల కంటే చాలా ఎక్కువ. దానికంటే ముందు 2019-20లో మొత్తం ఈవీ అమ్మకాలు 1,68,300 యూనిట్లుగా నమోదయ్యాయి.

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబీల్ డీలర్స్ అసోసియేషన్(ఫాడా) ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలు 17,802 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది కూడా అంతకుముందు కంటే మూడు రెట్లు ఎక్కువ. ఇందులో దేశీయ అతిపెద్ద సంస్థ టాటా మోటార్స్ 15,198 యూనిట్లతో 85.37 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత ఎంజీ మోటార్ ఇండియా 11.49 శాతం వాటాతో 2,045 యూనిట్లను విక్రయించింది. మహీంద్రా 156, హ్యూండాయ్ మోటార్ ఇండియా 128 యూనిట్లను విక్రయించాయి. ఈ కంపెనీలు రెండూ 1 శాతం కంటే తక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రిటైల్ అమ్మకాలు 2,31,338 యూనిట్లుగా నమోదయ్యాయని ఫాడా పేర్కొంది. ఇవి అంతకుముందు కంటే ఐదు రెట్లు పెరిగాయి. హీరో ఎలక్ట్రిక్ 28.23 శాతం వాటాతో 65,303 యూనిట్లను విక్రయించి మొదటిస్థానంలో ఉంది. దీని తర్వాత ఒకినావ 46,447 యూనిట్లను, ఆంపియర్ 24,648 యూనిట్లను, హీరో మోటోకార్ప్ మద్దతున్న ఆథర్ ఎనర్జీ 19,971 యూనిట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ 14,371 యూనిట్లతో ఆరో స్థానంలో ఉండగా, టీవీఎస్ 9,458 యూనిట్లతో ఏడో స్థానంలో నిలిచింది. ఎలక్ట్రిక్ వాణిజ్య(కమర్షియల్) వాహనాల అమ్మకాలు 400 యూనిట్ల నుంచి 2,203 యూనిట్లకు పెరిగాయని ఫాడా వెల్లడించింది.


Next Story