టీవీవీపీ కమిషనర్‌గా డా. అజయ్​కుమార్.. చివరి నిమిషం దాకా హైడ్రామా!​

by Disha Web Desk 19 |
టీవీవీపీ కమిషనర్‌గా డా. అజయ్​కుమార్.. చివరి నిమిషం దాకా హైడ్రామా!​
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎట్టకేలకు టీవీవీపీ పూర్తి స్థాయి కమిషనర్‌గా డా. అజయ్​కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సోమవారం హెల్త్​సెక్రటరీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత కొత్త వ్యక్తికీ అవకాశం దక్కడం గమనార్హం. కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి సూపరింటెండెంట్‌గా పనిచేసిన అజయ్​కుమార్‌కు అడ్మినిస్ట్రేషన్, ఆసుపత్రి వ్యవహరాలు, చికిత్సపరమైన అనుభవం మెండుగా ఉన్నదని ప్రభుత్వం గుర్తించింది. మెరుగైన సేవలు అందిస్తారని స్థానిక ప్రజలు సైతం ఫీడ్​బ్యాక్​ఇచ్చారు. ఇటీవల కామారెడ్డి ఆసుపత్రిని విజిట్​చేసిన మంత్రి హరీష్​రావు డా అజయ్​కుమార్ పనితీరును స్వయంగా గుర్తించి స్టేట్ హెచ్​ఓడీ పోస్టు ఇవ్వాలని నిర్ణయించారు.

వివిధ స్థాయిలలోని వ్యక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఆ తర్వాత ఇటీవల టీవీవీపీ కమిషనర్‌గా అవకాశం ఇస్తున్నామంటూ స్టేట్​హెల్త్​ఉన్నతాధికారుల్లో ఒకరు డా అజయ్​కుమార్‌కు ఫోన్​ద్వారా విషయం తెలిపారు. ఆర్డర్​రెడీ‌గా ఉన్నదని వెంటనే వచ్చి తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆయన చేతిలో జాయింట్​కమిషనర్​ఆర్డర్ కాఫీని చేతిలో పెట్టారు. ఇదేందీ అని ఆయన అడగ్గా, నిబంధనల ప్రకారం నేరుగా కమిషనర్‌గా పోస్టు ఇవ్వకూడదని, అంతేగాక కొన్ని రోజుల పాటు జాయింట్​ కమిషనర్‌గా పనిచేస్తే హెడ్​ఆఫీస్​వ్యవహారాల్లో అనుభవం వస్తుందని ఓ ఉన్నతాధికారి ఆయనకు వివరించారు. చేసేదేమీ లేక ఆయన కూడా జాయింట్​ కమిషనర్‌గా సుమారు నెల రోజుల పాటు విధులు నిర్వర్తించాల్సి వచ్చింది.

చివరి నిమిషం వరకు ట్విస్టులే..

ఇన్నాళ్లు ఇంచార్జీ కమిషనర్‌గా వ్యవహరించిన డా రమేష్​రెడ్డి చివరి నిమిషం వరకు కూర్చీని వదిలేందుకు ఇష్టపడలేదని హెల్త్​ డిపార్ట్​మెంట్‌లో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే మూడు పోస్టులకు బాస్‌గా ఉన్న ఆయన టీవీవీపీ‌ని కూడా తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఆఖరి నిమిషం వరకు తనదైన శైలీలో ప్రయత్నాలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కానీ సర్కార్​ఆయన ఎత్తుగడలను తొక్కి పెట్టి కొత్త వ్యక్తికి అవకాశం కల్పించడం గమనార్హం.

ఫిర్యాదులు ఫుల్..

ఇన్నాళ్లూ టీవీవీపీలో పూర్తి స్థాయి కమిషనర్​లేరు. దీంతో ఇంచార్జీగా డీఎంఈ డా రమేష్​రెడ్డి వ్యవహరించారు. ఆయన గాంధీ మెడికల్​కాలేజీ ప్రిన్సిపాల్‌గాను పనిచేస్తున్నారు. దీంతో ఒక వ్యక్తి దగ్గరే మూడు పోస్టులు ఉండటం వలన ఆయా విభాగాలను సమర్ధవంతంగా అమలు చేయడం, పర్యవేక్షించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు డాక్టర్లు, వైద్యసిబ్బంది ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా టీవీవీపీ విభాగం అస్తవ్యస్తంగా మారిపోయిందని స్వయంగా ఎంఎల్‌ఏల నుంచే ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో టీవీవీపీని ప్రక్షాళన చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా మంత్రి హరీష్​రావు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.



Next Story

Most Viewed