భారత తదుపరి ప్రధాని అతనే.. క్లారిటీ ఇచ్చిన అమిత్ షా!

by Disha Web Desk 2 |
భారత తదుపరి ప్రధాని అతనే.. క్లారిటీ ఇచ్చిన అమిత్ షా!
X

"యోగికి ఎలాంటి రాజకీయ వారసత్వం లేదు. కింది స్థాయి నుంచి సంఘ్-హిందుత్వ భావజాలం మధ్య పెరిగారు. ఐదుసార్లు గోరఖ్‌పూర్ ఎంపీగా గెలుపొందారు. యూపీ ముఖ్యమంత్రిగా పరిపాలనపై పూర్తి పట్టు సాధించారు. పెద్దగా చదువు లేకపోయినా పరిపాలనను గాడిలో పెట్టారు. ఇంగ్లిషులో ఉపన్యాసం సాధ్యం కాకపోయినా ప్రజలతో నేరుగా కనెక్ట్ అవుతున్నారు. మోడీ తరహాలోనే ధారాళంగా ప్రజల భాషలో ప్రసంగించగలరు.." సంఘ్ నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఒక సీనియర్ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలైంది. మూడున్నర దశాబ్దాల తర్వాత వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా బీజేపీ చరిత్ర సృష్టించింది. రెండోసారి వరుసగా పూర్తి స్థాయి సీఎం అయిన వ్యక్తిగా యోగి ఆదిత్యనాథ్​ గుర్తింపు పొందారు. ఈ విజయం భవిష్యత్తులో ఆయనను ప్రధాని స్థాయికి తీసుకెళ్తుందనే చర్చ పార్టీ అగ్రనేతల మధ్య సాగుతున్నది. వెంటనే కాకపోయినా మూడేళ్ల తర్వాత అది రియాలిటీగా మారుతుందనే వాదన వినిపిస్తున్నది. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న మోడీకి, యోగికి అనేక అంశాల్లో ఉన్న సారూప్యతే భవిష్యత్తులో ఈ ఊహాగానాన్ని నిజం చేస్తుందనే చర్చ మొదలైంది. ప్రజలతో నేరుగా కనెక్ట్ కావడంలో, నిరాడంబర జీవితం గడపడంలో, హిందుత్వ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ ఇద్దరి మధ్య పోలికలను అటు బీజేపీ నేతలు, ఇటు సంఘ్ నాయకులు ప్రస్తావిస్తున్నారు. సంఘ్ భావజాలంతో సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించే స్థాయికి ఎదిగిన ప్రయాణాన్ని కూడా గుర్తుచేస్తున్నారు. మోడీకి, యోగికి ఇంగ్లీషు భాష మీద పెద్దగా పట్టు లేనప్పటికీ ప్రజలకు అర్థమైన భాషలో భావాన్ని వ్యక్తీకరించడం, వారి విశ్వాసాన్ని చూరగొనడం, పాలనలో వారి మార్కును చూపడం.. ఇవన్నీ భవిష్యత్తులో ప్రధాని స్థాయికి మోడీ తర్వాత యోగి మాత్రమే అన్ని విధాలా అర్హుడనే ఒక సాధారణ అభిప్రాయం ఉత్తరాది ప్రజల్లో, బీజేపీ కార్యకర్తల్లో, సంఘ్ నేతల్లో ఉన్నది.


లిఖితపూర్వకంగా పార్టీ నిబంధనావళిలో ఎక్కడా లేనప్పటికీ 75 ఏళ్ల వయసు దాటినవారు ప్రధాని స్థాయిలో ఉండొద్దనేది సిద్ధాంతం బీజేపీలో అమలవుతున్నది. ఆ నిబంధనను పార్టీ తు.చ. తప్పకుండా అమలు చేయాలనుకుంటే ప్రస్తుతం 72 ఏళ్ల వయసులో ఉన్న మోడీ 2024 ఎన్నికల తర్వాత ఒక్క ఏడాది మాత్రమే ఆ పదవిలో కొనసాగనున్నారు. ఆయన స్థానాన్ని యోగి ఆదిత్యనాధ్ భర్తీ చేసే అవకాశాలే ఎక్కువ. ప్రస్తుతం మోడీకి రైట్ హ్యాండ్ అమిత్ షా అనే భావన ఉన్నప్పటికీ ప్రధాని అభ్యర్థి ఎంపికలో మాత్రం యోగికి ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం కనిపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వంలో మోడీ తరహాలోనే యూపీ పరిపాలనలో ఏది జరగాలన్నా కేంద్రీకృతంగా యోగి కనుసన్నల్లోనే ఉండడాన్ని కూడా ఒక అంశంగా గుర్తుచేస్తున్నారు. ఒక జాతీయ పార్టీగా క్రమంగా కాంగ్రెస్ తన గుర్తింపును కోల్పోతుండడం బీజేపీకి కలిసొస్తున్నది. ఇది మరింతగా బలపడాలంటే నిస్వార్థంగా, నిజాయితీగా జీవిస్తున్న యోగి లాంటి వ్యక్తి ద్వారా మాత్రమే సాధ్యమనే అభిప్రాయాన్ని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

షా నోటి వెంట.. యోగి మాట!

అమిత్ షా సైతం ఇటీవల ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో పరోక్షంగా యోగి భావి ప్రధాని అంశాన్ని నొక్కిచెప్పారు. భవిష్యత్తులో కేంద్రంలో పూర్తి సంఖ్యా బలంతో బీజేపీ అధికారంలోకి రావాలంటే అది 80 పార్లమెంటు స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో గెలవడం ద్వారా మాత్రమే సాధ్యమని పేర్కొన్నారు. యూపీని తక్కువ చేసి చూస్తే కేంద్రంలో అధికారంలోకి రావడం దుస్సాహసమే అవుతుందన్నారు. 2024లో ఢిల్లీలో అధికారం సాధ్యం కావాలంటే అది వయా ఉత్తరప్రదేశ్‌గానే ఉంటుందని వ్యాఖ్యానించారు. యూపీ ముఖ్యమంత్రిగా యోగి తనదైన ముద్ర వేశారని, ఆదర్శవంతమైన పాలనను అందించారని గుర్తుచేశారు. శాంతిభద్రతల నిర్వహణలో చాలా లోతైన అధ్యయనంతో యాక్షన్ ప్లాన్ అమలుచేశారని, నేరాలు దాదాపు 70% మేర తగ్గాయని గుర్తుచేశారు. అభివృద్ధిపరంగానూ రోడ్లు, ఎక్స్ ప్రెస్ హై వేలు వచ్చాయని, రెండున్నర దశాబ్దాల తర్వాత యూపీలో పన్నెండు గంటలకు పైగా విద్యుత్ నిరంతరాయంగా అందుతున్నదని ప్రస్తావించారు. ఘజియాబాద్ నుంచి గంగా వరకు, గోరఖ్‌పూర్ నుంచి ఆగ్రా వరకు అన్ని ప్రాంతాల్లో డెవలప్‌మెంట్ కంటికి కనిపిస్తున్నదన్నారు. వీటన్నింటికీ మించి ప్రధాని ఎవరు కావాలన్నది ఒక పార్టీగా బీజేపీ కంటే ఆర్ఎస్ఎస్ నిర్ణయమే ఫైనల్. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి, ఎజెండాను అమలుచేయడానికి ఎవరు సమర్ధులో, ఎవరి ద్వారా సఫలీకృతం చేయవచ్చో ఆర్ఎస్ఎస్ నేతలకు స్పష్టమైన క్లారిటీయే ఉన్నది. ఆ ప్రకారం సెకండ్ ర్యాంక్‌లో ఉన్న అమిత్ షా కంటే యోగివైపే సంఘ్ ఎక్కువ నమ్మకం పెట్టుకున్నది.


రాధేశ్యామ్ మూవీపై మీ ఒపీనియన్ తెలపడానికి క్లిక్ చేయండి


Next Story

Most Viewed