హైదరాబాద్‌లో రూ.37 వేల కోట్లతో అభివృద్ధి చేశాం : కేటీఆర్

by Disha Web Desk |
హైదరాబాద్‌లో రూ.37 వేల కోట్లతో అభివృద్ధి చేశాం : కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రూ.37 వేలకోట్లతో 70 పనులను ప్రభుత్వం సిద్ధం చేసిందని, వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్ డీపీ) కింద హైదరాబాద్ లో 8052.92కోట్ల వ్యయంతో 47 పనులు చేపట్టామని పురపాలక, పట్టణ అభివృద్ధి, ఐటీ పరిశ్రమలుశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటివరకు 27 పనులను రూ.2497.95 కోట్లతో పూర్తి చేశామని తెలిపారు. శాసనసభలో గురువారం ప్రశ్నోత్తర సందర్భంగా హైదరాబాద్ లో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు పై ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్, అరెకపూడి గాంధీ, దానం నాగేందర్, మౌజంఖాన్ అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ వివరణ ఇచ్చారు. ఎస్ఆర్ డీపీ కింద ఇప్పటి వరకు 2497.95కోట్లతో 27 పనులు పూర్తి అయ్యాయని, మరో 20 పనులలో జీహెచ్ఎంసీ ద్వారా 17, ఆర్ అండ్ బీ, ఎన్ హెచ్ శాఖలతో 3 పనులను రూ.5554.97కోట్ల వ్యయంతో పురోగతిలో ఉన్నాయన్నారు.

మూసీనది కాలుష్యం తొలగించి రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేసేందుకు నోడల్ ఏజెన్సీగా పనిచేయడానికి స్పెషల్ పర్పస్ వాహనంగా మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్పొరేషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. మూసీ పునరుద్ధరణతో పాటు సర్వతోముఖాభివృద్ధికి దాదాపు 55 కిలో మీటర్లు పొడవున మూసీ రివర్ ఫ్రంట్ ను పర్యావరణ హితంగా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. ఓఆర్ఆర్ పరిధి గండిపేట నుంచి ఓఆర్ఆర్ ఈస్ట్ 47 కిలో మీటర్లు, హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ 8 కిలో మీటర్లు మొత్తం 55 కిలో మీటర్ల పొడవున 9000 వేలకోట్లతో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. నది ప్రక్షాళన, సుందరీకరణ, రవాణాతో పాటు సమగ్ర అభివృద్ధి జరిగేలా నది పొడవునా పునరుద్ధరణ చేయనున్నట్లు వెల్లడించారు.

మూసీ సమగ్ర బృహత్ అభివృద్ధి ప్రణాళిక, సవివరమైన ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసేందుకు కన్నల్టెన్సీని వినియోగించేందుకు చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధి, మూసీ నది ఇరువైపుల రోడ్డు, ఎట్ గ్రేడ్ రోడ్డులు సాధ్యం కాని చోట స్కైవేల ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధమైన తర్వాత మాత్రమే అంచనా వ్యయం తెలుస్తుందని వెల్లడించారు. మార్చి 2018 నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఓఆర్ఆర్ పశ్చిమ నుంచి ఆర్ ఆర్ తూర్పు వరకు మూసీనది వెంబడి డిజిటల్ ఎలివేషన్ మోడ్, డిజిటల్ ఉపరితల మోడ్ లను డ్రోన్ సర్వే నిర్వహించామని తెలిపారు. నది సరిహద్దును ఖరారు చేయడానికి, ఓఆర్ఆర్ పశ్చిమ నుంచి ఓఆర్ఆర్ తూర్పు వరకు మూసీనది వెంట బఫర్ జోన్ నిర్దారించడానికి డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంను వినియోగించినట్లు వెల్లడించారు.

నాగోల్, చాదర్ ఘాట్, ముస్లింజంగ్ బ్రిడ్జి వద్ద మూసీ అంచులపై వాక్ వేలు, ల్యాండ్ స్కేపింగ్ ఏర్పాటుతో సుందరీకరణ పనులు చేపట్టామన్నారు. మూసీలో తెలియాడే చెత్తాచెదారం తొలగించేందుకు 10 ప్రదేశాల్లో బారికేడ్లు నిర్మించామని, దోమల బెడద, దుర్వాసనను అరికట్టేందుకు హైడ్రాలిక్ ఎక్స్ కవేటర్లు, పైరోసిన్ పిచికారి, పొగ చల్లడం వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఇప్పటికే మూడు చెక్ డ్యాంలు నిర్మించామని తెలిపారు. కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు, గండిపేట నుంచి మూసీకి శాశ్వతంగా నీరందించేందుకు 1250కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మూసీ అభివృద్ధే లక్ష్యమన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి మూసీని డెవలప్ మెంట్ కు సలహాలు, సూచనలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.



Next Story

Most Viewed