'నేనేం తప్పు చేశాను.. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తో తొక్కిస్తారట..'

by Disha Web Desk 13 |
నేనేం తప్పు చేశాను.. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తో తొక్కిస్తారట..
X

దిశ, మణుగూరు: కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేస్తూ నిత్యం సభ్యత్వాలు నమోదు చేస్తుంటే‌‌.. నేను ఏం తప్పు చేశానని నన్ను పార్టీ పదవిలో నుంచి తొలగించారని కరకగూడెం మండల అధ్యక్షుడు సయ్యద్ ఇబ్బల్ హుస్సేన్ టీపీసీసీ ఉపాధ్యక్షుడు, డీసీసీ అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్యను ఘాటుగా ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం మండలంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మణుగూరు మండల అధ్యక్షుడు గురిజాల గోపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.


గత నెల 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించేందుకు భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య దగ్గరకు వెళ్ళితే స్పందించలేదని చెప్పుకొచ్చారు. అయితే ఈ క్రమంలో ఆ 50 మందిని తీసుకొని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లి ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగిందని వివరించారు.

అయితే భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య అదే రోజు గాంధీ భవన్ సాక్షిగా నాకు ఫోన్ చేసి తనను, ఇంట్లో మహిళలపై అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపించారు. ఇంత జరిగినా ఈ విషయం ఎవరికి చెప్పుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరల పద్ధతి మార్చుకోకుండా మళ్లీ ఫోన్ చేసి అదే విధంగా అసభ్యకరంగా దూషించడంతో..‌ ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు విషం తాగి చనిపోతామని అంటున్నారని తెలిపారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. తొక్కి బూడిద చేస్తానని అన్నారని, రికార్డ్ సాక్ష్యం కూడా ఉందన్నారు.

ఈనాడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి.. నిన్ను పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావుతో చెప్పి తొక్కిస్తానాని అన్నారని ఈ రికార్డ్ సాక్ష్యం ఉందని మీడియా సాక్షిగా తెలిపారు. దీనిని బట్టి టీఆర్ఎస్ పార్టీ కోవర్ట్ ఎవరో అర్ధం అవుతుందని ఆయన వివరించారు. అర్దాంతరంగా పార్టీ నుంచి కో-కన్వీనర్ గురిజాల గోపిని, మండల అధ్యక్ష పదవులను తొలగించారని ఆయన చెప్పుకొచ్చారు. ఎటువంటి షోకాజ్ నోటీసులు లేకుండా మమ్మల్ని తొలగించడం దుర్మార్గమన్నారు.


ఇప్పటికైనా భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య క్షమాపణ చెప్పకపోతే అధిష్టానాన్ని సంప్రదిస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు లక్కినేని సాయి, నియోజకవర్గ నాయకుడు బట్ట విజయ గాంధీ, జిల్లా ఎస్టీ సెల్ మెంబర్ కోటేష్ నాయక్, సీనియర్ నాయకుడు భుర్గుల నరసయ్య, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షుడు అగ్ని నవీన్, నాయకులు ఉమర్, కోడియం సాంబ, మహిళ నాయకురాళ్లు జిల్లా భోగినేని వరలక్ష్మి, సౌజన్య, తేజవత్ దేవి తదితరులు పాల్గొన్నారు.

Next Story