పెరగనున్న అన్ని రకాల వస్తువుల ధరలు!

by Disha Web Desk 17 |
పెరగనున్న అన్ని రకాల వస్తువుల ధరలు!
X

దిశ, వెబ్‌డెస్క్: కిరాణా సామగ్రి, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లతో పాటు దిగుమతి చేసుకునే బ్యూటీ ఉత్పత్తులు, గడియారాల ధరలు రాబోయే మరికొద్ది రోజుల్లో పెరగనున్నట్టు తెలుస్తోంది. గత నెలాఖరు నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో విడిభాగాల ధరలు భారీగా పెరుగుతుండటం, రూపాయి విలువ క్షీణిస్తుండటమే దీనికి కారణమని మార్కెట్ నిపుణులు తెలిపారు. ఈ వస్తువుల ధరలు దాదాపు 10 శాతం ఖరీదైనవిగా మారవచ్చని, వంట నూనె ధరలు 20 శాతం భారం కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికె సన్‌ఫ్లవర్ ఆయి, పామాయి, స్టీల్, అల్యూమియం, రాగి, ముడి చమురు, ఇంకా పలు రకాల వస్తువుల ధరలు గత 10 రోజుల్లో 10-15 శాతం పెరిగాయి. గత వారం రోజులుగా రూపాయి మరింత క్షీణిస్తుండటంతో వస్తువుల ధరలు మరింత ఒత్తిడికి గురవుతున్నాయి.

కరోనా మహమ్మారి సమయంలో ఎలక్ట్రానిక్స్ రంగం ప్రతి త్రైమాసికానికి 2-3 శాతం రేట్లను పెంచాల్సి వచ్చింది. ఇప్పుడు కరోనా మహమ్మారి నెమ్మదించినప్పటికీ, యుద్ధ పరిస్థితుల వల్ల రాబోయే త్రైమాసికంలో ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయని గోద్రెజ్ అప్లయెన్స్ వ్యాపార విభాగం కమల్ నంది అన్నారు. ఇటీవల పరిస్థితుల వల్ల ఇన్‌పుట్ ఖర్చులు 10-11 శాతం పెరిగాయని, ఈ భారాన్ని తగ్గించేందుకు ఏప్రిల్ నుంచి ధరల పెంపు ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి ఎలక్ట్రానిక్స్ వస్తువుల రిటైల్ ధరలు 3-5 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు గోధుమలు, మినుములు, మొక్కజొన్న ధరలు 10-20 శాతం వరకు ప్రభావం చూపించవచ్చని భారత పప్పులు, ధాన్యాల సంఘం చైర్మన్ అన్నారు.

Next Story

Most Viewed