'బండి'కి చెక్.. బీజేపీకి దిమ్మతిరిగేలా కేసీఆర్ వ్యూహం

by Disha Web Desk |
bjp mp bandi sanjay cm kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో : ధాన్యం కొనుగోళ్లపై ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు టీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ప్రతి ఇంటిపై నల్లజెండాలు ఎగురవేసేలా, రాష్ట్ర అధ్యక్షుడి ఇంటిముందు ధాన్యం పోసి పోరును ఉధృతం చేయాలని భావిస్తోంది. రైతుపక్షం టీఆర్ఎస్ అని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నాయకత్వం కార్యాచరణ చేపడుతోంది. ఉగాది తర్వాత సీఎం కేసీఆర్ కార్యచరణను ప్రకటించనున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ధాన్యం కొనుగోళ్ల అంశం లేఖలు, మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలోనే రాష్ట్రంలో వరికోతలు ప్రారంభం కావడం కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. మంత్రులు కేంద్రమంత్రిని స్వయంగా కలిసి వినతులు ఇచ్చినా గతంలో చెప్పిన అంశాన్నే చెప్పడంతో మార్చి 25 నుంచి 31 వరకు గ్రామ, మండల, జిల్లా, మున్సిపాలిటీల తీర్మానం చేపట్టి నేరుగా ఆ కాఫీలను ప్రధాని మోడీకి పంపారు. అయినప్పటికీ కేంద్రం నుంచి పారాబాయిల్డు రైస్ కొనుగోలు చేస్తామని స్పష్టమైన హామీ రాలేదు. దీంతో ఉగాది తర్వాత కార్యాచరణ చేపడతామని పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. బీజేపీని ఎలా ఇరుకున పెట్టాలని కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. పార్టీ ప్రకటించే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని పార్టీ ఆదేశాలు సైతం ఇచ్చింది. ఉగాది మర్నాడే కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించి ఉద్యమకార్యాచరణను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

బీజేపీ, రాష్ట్ర అధ్యక్షుడే లక్ష్యంగా...

ఉగాది తర్వాత టీఆర్ఎస్ దూకుడు పెంచనుంది. బీజేపీ పార్టీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని తెలంగాణపై వివక్ష చూపుతోందని మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహం రచిస్తోంది. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, ఎంపీగా ఉండి కూడా ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని, ఇది రైతులపట్ల ఆయనకు ఉన్న వివక్ష అని, గతంలో రాష్ట్ర ప్రభుత్వం వరి వేయవద్దంటే బండి వేయాలని ప్రోత్సహించాడని, కేంద్రంతో కొనిపిస్తామని చేసిన వీడియోలను ప్రజలకు చూపేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తోంది. ప్రజల్లో బీజేపీని జీరో చేసే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై నల్లజెండాలు ఎగురవేయాలని ప్రజలకు గులాబీ అధినేత పిలుపు ఇవ్వనున్నారు. అదే విధంగా బీజేపీ అధ్యక్షుడి బండి ఇంటి ముందు కూడా ధాన్యం పోసి నిరసన తెలియజేసేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. ధాన్యంపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ప్రజల అభిమానాన్ని చూరగొనేలా స్కెచ్ వేస్తోంది.

బీజేపీ ఎంపీపీల తీర్మానం సైతం అస్త్రంగా...

రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని గ్రామం నుంచి జిల్లా వరకు తీర్మానాలకు పిలుపు నిచ్చింది. ఆ తీర్మానాలకు కొన్ని చోట్ల బీజేపీ స్థానిక ప్రజాప్రతినిధులు మద్దతు తెలిపారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ లో బీజేపీ ఎంపీపీ రజని, డిచ్ పల్లిలో అదేపార్టీ ఎంపీపీ గద్దె భూమన్న సైతం తీర్మానం చేశారు. ఈ అంశాన్ని సైతం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల బాధ్యత కేంద్రానిదేనని రాష్ట్రానిది కాదని బలంగా చెప్పనున్నారు. బీజేపీని అష్టదిగ్బంధం చేసేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు.

అమిత్ షాకు నిరసన తగిలేలా....

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహాసంగ్రమయాత్రను ఏప్రిల్ 14 నుంచి రెండో విడత చేపడుతున్నారు. అందుకు కేంద్రమంత్రి అమిషా వస్తుండటంతో ధాన్యం కొనుగోళ్లపై నిరసనను తెలియజేసేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. అడ్డుకోవాలా? వినతులు ఇచ్చి నిరసన తెలపాలా? అనే విషయంపై టీఆర్ఎస్ దృష్టిసారించింది. అడ్డుకొని రభసా చేస్తేనే జనంలోకి వెళ్లొచ్చని కూడా పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ధాన్యంపై టీఆర్ఎస్ తప్పా మరోపార్టీ పోరాడటం లేదని ప్రజల్లో నమ్మకం కలిగించేలా ఉద్యమానికి టీఆర్ఎస్ రెఢీ అవుతోంది.

కాంగ్రెస్‌ను సైతం అడ్డుకునేలా...

ఇప్పటికే ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. కొనుగోళ్లలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతికతను విస్మరిస్తూ రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటని, రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులను క్షోభ పెట్టే పనులు మానుకోవాలని సూచించడంతో టీఆర్ఎస్ నేతలు ట్విట్టర్ వేదికగా మూకుమ్మడి దాడిచేశారు. మరో పక్క రేవంత్ రెడ్డి సైతం ధాన్యంపై ఏప్రిల్ లో పోరుకు కార్యాచరణ చేపట్టారు. ఢిల్లీలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధర్నా చేస్తే తాము సైతం పాల్గొని మద్దతు తెలుపుతామని ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ మైలేజ్ తగ్గుతుందని భావించిన పార్టీ అధిష్టానం ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌లను టార్గెట్ చేస్తూ గులాబీ బాస్ కార్యచరణను ప్రకటించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు దొందుదొందేనని ఇప్పటివరకు రైతుల పక్షాన పోరాటం చేయలేదని ప్రజలకు వివరించేందుకు సన్నద్ధమవుతున్నారు టీఆర్ఎస్ శ్రేణులు.

ఇదిలా ఉంటే నిరసనలు, రాస్తారోకోలతో ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా వినూత్నంగా కార్యచరణ చేపట్టబోతున్నట్లు సమాచారం. గతంలో రహదారులపై ధర్నాలు నిర్వహించినా కేంద్రం నుంచి స్పందన రాలేదని, అలాకాకుండా కొనుగోళ్ల అంశాన్ని బలంగా ప్రతి గడపకు తీసుకెళ్లేలా, పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పోగొట్టేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఏదీ ఏమైనప్పటికీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలాంటి కార్యచరణ చేపడతారోనని పార్టీ శ్రేణుల్లో అతృత నెలకొంది.



Next Story

Most Viewed