మమ్మల్ని అవమానించారు సరే.. కనీసం కేటీఆర్‌కు కూడా సమాచారమివ్వరా?

by Disha Web Desk 2 |
మమ్మల్ని అవమానించారు సరే.. కనీసం కేటీఆర్‌కు కూడా సమాచారమివ్వరా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: 111 జీవో రద్దు విషయంలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా సీఎం కేసీఆర్ అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపక్షాలను అవమాన పరిచారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. సీఎం 111 జీవో రద్దు చేస్తున్నట్టు ప్రకటించారని, అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడే అంశాన్ని ముందుగా బులిటెన్ రూపంలో తెలపాలని అన్నారు. ప్రభుత్వం భవిష్యత్‌ను ఆలోచించుకొని మాస్టర్ ప్లాన్ చేయాలన్నారు. కానీ, ప్రభుత్వానికి ఒక ప్లాన్ లేదని మండిపడ్డారు. ఒక ముఖ్యమైన జీవో రద్దు చేస్తామని ప్రకటించే ముందు ఎలాంటి చర్చ లేదన్నారు. నేషనల్ సెన్సింగ్ అథారిటీ హైదరాబాద్‌లో ఏ భూమి ఎలా వాడుకోవాలో తెలిపినట్లు చెప్పారు. గండిపేట నీరు చాలా మంచిదని, అలాంటి చెరువులను పొడిచేస్తామని అనడం చాలా దారుణమని అన్నారు.

మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఈ సమాచారం లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. జీవో 111 ను రివ్యూ చేయాలని, బహిరంగంగా చేయాలని, పర్యావరణ వేత్తలతో, రైతులతో బహిరంగ చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. 1.36 లక్షల ఎకరాల భూమి ఉందని అంటున్నారు.. భూముల లెక్కలు తేల్చాలన్నారు. ఇందులో ఒక రహస్య ఎజెండా ఉన్నదని అనుమానం ఉన్నట్లు తెలిపారు. రైతులు తరతరాలుగా వారసత్వంగా వ్యవసాయం చేసి చెరువుల పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా‌కి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసిందన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ లోపాయికారి సమాచారంతో రైతుల నుంచి టీఆర్ఎస్ నేతలు ఏడేళ్ల పాటు పెద్ద ఎత్తున భూములు కొన్నారని, భూములు కొన్నాక ఇప్పుడు 111 జీవో ఎత్తేశారని ఆరోపించారు. ఈ విషయంలో పార్టీ అధ్యక్షులతో పార్టీలో లోతుగా చర్చలు జరిపి నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.



Next Story

Most Viewed