ఇన్ని రోజులు ఓ లెక్క.. ఇప్పుడో లెక్క... 'ఇష్టముంటే చేరండి, లేదా వెళ్లిపోండి'

by Dishanational1 |
ఇన్ని రోజులు ఓ లెక్క.. ఇప్పుడో లెక్క... ఇష్టముంటే చేరండి, లేదా వెళ్లిపోండి
X

రాష్ట్రంలో 80 వేల పైచిలుకు కొలువులు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఎలాగైనా ఈ సారి జాబ్ కొట్టాలనే తలంపుతో రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ కు పరుగులు పెడుతున్నారు. కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న సెంటర్ల నిర్వాహకులు భారీగా ఫీజులు పెంచేశారు. ఒక్కో అభ్యర్థి నుంచి 5 వేల నుంచి 15 వేల రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. సీనియర్ ఫ్యాకల్టీ, సులువుగా అర్థమయ్యే మెటీరియల్ అని ప్రచారం చేసుకుంటూ భారీగా ఫీజులు వసూలు చేస్తుండటం గమనార్హం.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇన్ని రోజులు ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క.. అన్నట్లుగా కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల తీరు మారింది. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా 80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే. సర్కారు ఇటీవలే తొలివిడతగా 30 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి అంగీకారం తెలుపడంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఎలాగైనా కలల కొలువును పట్టేయాలని విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య లక్షల్లో ఉండగా, ప్రభుత్వం మాత్రం తొలివిడతగా 30 వేల పోస్టుల భర్తీకి మాత్రమే ఓకే చెప్పింది. గతంలో ఎన్నడూ లేనంత పోటీ వాతావరణం నెలకొంది. పల్లె నుంచి పట్నం దాకా అందరూ.. సర్కారు నౌకరీ కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. తమకు అందుబాటులో ఉన్న కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. ఇదే అదునుగా.. ఉద్యోగం ఏదైనా 'పోస్టు గ్యారెంటీ' ప్రకటనలతో కోచింగ్‌ సెంటర్లు నిరుద్యోగుల నుంచి రూ. వేలల్లో సొమ్మును ముక్కుపిండి మరీ దండుకుంటున్నాయి. ప్రతి ఇనిస్టిట్యూట్‌లో కనీసం రూ.5 వేలు పెంచినట్లుగా తెలుస్తున్నది. ఈ క్రమంలో అభ్యర్థులు అప్పులు చేసి మరీ కోచింగ్‌ సెంటర్లలో చేరుతున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క, ఉద్యోగాలను మేమిప్పిస్తామంటే.. మేమిప్పిస్తామంటూ.. అభ్యర్థులకు దళారులు గాలం వేస్తున్నారు. తెలంగాణలో ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా? అని నిరుద్యోగులు వెయ్యి కండ్లతో ఎదురుచూశారు. తాజాగా 30వేల పైచిలుకు పోస్టులకు నోటిఫికేషన్ వేయడంతో నిరుద్యోగులంతా తమ స్వగ్రామాల నుంచి నగర బాట పట్టారు. గతంలో పోలీస్ ఉద్యోగానికి కోచింగ్‌కు గాను రూ.15 వేలుంటే, ఇప్పుడు కోచింగ్​సెంటర్‌ను బట్టి రూ. 20 వేల నుంచి రూ. 25వేల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. దాదాపు రూ.5 వేల నుంచి రూ.10 వేలు పెంచడంతో యూనిఫాం పోస్టులకు ప్రిపేరయ్యే అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్‌లో 16వేల పైచిలుకు పోస్టులు పోలీస్ డిపార్ట్​మెంట్‌కు చెందినవే కావడంతో చాలామంది అభ్యర్థులు కోచింగ్ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. అలాగే గ్రూప్–1 పోస్టులకు గతంలో రూ.45 వేల పైచిలుకు ఉంటే ఇప్పుడు దాదాపు రూ.65 వేల నుంచి రూ.70 వేలకు చేరుకోవడం గమనార్హం. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్, అశోక్‌నగర్, చిక్కడపల్లి, కూకట్‌పల్లి, అమీర్‌పేట, దిల్‌సుఖ్​నగర్, ఉప్పల్, తార్నాక, నల్లకుంట, విద్యానగర్ వంటి ప్రాంతాల్లో కోచింగ్​సెంటర్లు అన్ని కలుపుకొని దాదాపు 300కు పైగా ఉన్నాయి. ఇప్పుడు సర్కార్​30వేల పైచిలుకు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్​ఇవ్వడంతో లక్షల్లో నిరుద్యోగులు, యువత దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి. సీనియర్ ​ఫ్యాకల్టీ, సులువుగా అర్థమయ్యే మెటీరియల్ అంటూ అదనంగా దోచుకుంటున్నారు.

ఫీజు తగ్గించాలి: ప్రవీణ్, హైదరాబాద్

కోవిడ్ కారణంగా ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయాం. లేక లేక రాష్ర్ట ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసింది. కోచింగ్​సెంటర్‌కు వెళ్తే ఫీజు వేలల్లో చెబుతున్నారు. ఎంత బతిమాలినా తగ్గించేదేలేదని చెబుతున్నారు. ఇష్టముంటే చేరండి, లేదా వెళ్లిపోండి అంటున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఎలా ప్రిపేరయ్యేది.

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: రాకేశ్, వరంగల్

కోచింగ్​సెంటర్లలో ఇష్టారాజ్యంగా ఫీజు దోచుకుంటున్నారు. కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు సిండికేట్‌గా మారి నిరుపేదల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. భారీ మొత్తంలో ఫీజులు పెంచడంతో పేద విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ దోపిడీని అరికట్టాలి.



Next Story

Most Viewed