టీఆర్ఎస్‌ను ఉక్కిరి బిక్కిరి చేసేలా బీజేపీ ప్లాన్​

by Disha Web Desk |
టీఆర్ఎస్‌ను ఉక్కిరి బిక్కిరి చేసేలా బీజేపీ ప్లాన్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ రాష్ట్ర నాయకత్వం వచ్చే ఎన్నికల కోసం కసరత్తులు చేస్తోంది. గతంలో లాగా కాకుండా ఈసారి అభ్యర్థుల పేర్లను ముందుగానే ప్రకటించి టీఆర్ఎస్‌కు షాకిచ్చేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం వ్యూహ రచన చేస్తోంది. దీనికి జాతీయ నాయకత్వం గ్రీన్​సిగ్నల్​ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే రాబోయే ఎన్నికల కోసం బలమైన అభ్యర్థుల వేటలో రాష్ట్ర నాయకత్వం పడింది. ఓటర్లను ప్రభావితం చేసే కీలక నేతలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫుల్​ఫోకస్​పెడుతోంది. గత ఎన్నికల్లో జరిగిన వైఫల్యాలను ఈసారి రిపీట్​కాకుండా ఉండేందుకు తీవ్రస్థాయిలో శ్రమిస్తోంది. అందుకే రాబోయే ఎన్నికల సమయానికి అభ్యర్థుల జాబితాను పూర్తిస్థాయిలో రూపొందించేందుకు కసరత్తులు చేస్తోంది. అధికార పార్టీ కంటే ముందుగానే అన్నీ సిద్ధం చేసుకుని టీఆర్ఎస్​కు గట్టి షాక్​ఇవ్వాలని కాషాయదళం ప్లాన్​చేస్తోంది. గతంలో జరిగిన తప్పులు మరోసారి జరగకుండా చూసుకుంటూ బీజేపీ ఆచితూచి పావులు కదుపుతోంది.

2018 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్​ముందుగానే 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రతిపక్ష పార్టీలకు కోలుకోలేని షాకిచ్చింది. ఇప్పుడు అదే ఫార్ములాను బీజేపీ ఉపయోగించుకొని టీఆర్ఎస్​కోలుకోలేని దెబ్బ కొట్టాలని వ్యూహరచన చేస్తోంది. గులాబీదళంలో ఇప్పుడున్న నేతల్లో చాలామంది ఎమ్మెల్యేలపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురవుతోంది. దీన్నే బీజేపీ క్యాష్​చేసుకొని టీఆర్ఎస్​కు వ్యతిరేకత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అపోజిట్​గా బలమైన అభ్యర్థిని దించి గెలవాలని కమలనాథులు ప్లాన్​చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఒకేసారి 105 మంది అభ్యర్థులను గులాబీ బాస్​కేసీఆర్ ప్రకటించడంతో బీజేపీకి చివరి క్షణం వరకు సరైన అభ్యర్థులు దొరక్క భంగపడ్డారు. ఈసారి ఆ సీన్​రిపీట్​కాకుండా ఉండేందుకు బీజేపీ శ్రేణులు ఎత్తుగడలు సిద్ధం చేసుకుంటున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన మైనస్‌లను సవరించుకునే పనిలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం తలమునకలైంది. 2018 ఎన్నికల్లో బీజేపీ చేసిన తప్పులేంటి? ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందనే అంశాలపై జాతీయ నాయకత్వం ఇప్పటికే ఆరా తీసినట్లు సమాచారం. ఇప్పటికే గత ఎన్నికలకు సంబంధించిన నివేదిక హైకమాండ్​కు అందినట్లు తెలుస్తోంది. ఆ నివేదికను నిశితంగా పరిశీలన చేసి వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర నాయకత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసినట్లు బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. పార్టీలో లోటుపాట్లతో పాటు అభ్యర్థుల ఎంపిక, పార్టీ బలోపేతంపై కూడా దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు టాక్. రాష్ట్ర నేతలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బాధ్యతలను అప్పగించిన హైకమాండ్.., రాబోయే ఎన్నికల్లో గెలుపుతో పాటు పార్టీ బలోపేతం, విస్తరణపై ఫోకస్​పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed