తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్

by Disha Web Desk |
BJP leader Bandi Sanjay
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, కానీ తెలంగాణలో సర్కార్ టీఆర్ఎస్‌ది అయితే దాని ఇంజిన్ మాత్రం దారుస్సలాంలో ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఐదు రాష్ట్రాల్లో నిర్వహించిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగడంపై రాష్ట్ర కార్యాలయంలో శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకుని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటిందని, ఆ రిజల్ట్స్ చూశాక తెలంగాణలోని కార్యకర్తల్లో కూడా ధైర్యం వచ్చిందన్నారు. కొందరు వ్యక్తులు కావాలనే లేనిపోని సర్వేల పేరుతో, కొన్ని మీడియా చానళ్లను అడ్డం పెట్టుకుని బీజేపీ పని అయిపోయిందని దుష్ప్రచారం చేశారన్నారు. కానీ వారి అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ బీజేపీ రికార్డు సృష్టించిందన్నారు. అక్కడి ప్రజలంతా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రంలో కూడా ఆ పార్టీ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని భావించి డబుల్ ఇంజిన్ సర్కార్ ను గెలిపించారని పేర్కొన్నారు.

కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లించడం.. అభివృద్ధిని అడ్డుకోవడం తెలంగాణ సర్కారుకు అలవాటు అయిపోయిందని బండి సంజయ్ విమర్శలు చేశారు. లేనిపోని ఆరోపణలు చేస్తూ కేవలం కేంద్రాన్ని బదనాం చేయడమే పనిగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణలోనే కాకుండా యావత్ దేశంలో 2014 నుంచి ఇప్పటి వరకు క్రమంగా బీజేపీ ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తోందని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ చెల్లని రూపాయి అని బండి సంజయ్ విమర్శలు చేశారు. చెల్లని రూపాయికి గీతలెక్కువ.. కేసీఆర్ కు కోతలెక్కువ అంటూ చురకలంటించారు. ఫ్రంట్ పెట్టే నాయకుడు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే అక్కడికి వెళ్లకుండా ఏం చేశాడని బండి సంజయ్ ప్రశ్నించారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటడంతో కేసీఆర్ ఫామ్ హౌజ్ లో బీటలు వారాయంటూ ఫైరయ్యారు. సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లింది కేవలం విహారాయత్రలకేనని ఎద్దేవా చేశారు. మిలియన్ మార్చ్ కి భయపడే ముఖ్యమంత్రి నోటిఫికేషన్లు ఇచ్చాడన్నారు.

కేసీఆర్ కు దమ్ముంటే ఈ నోటిఫికేషన్లు భర్తీ అయ్యే వరకు ఎన్నికలకు వెళ్లనని ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. నోటిఫికేషన్లు ఇచ్చేది వాళ్లే.. వాటిని అడ్డుకునేందుకు కేసు వేసేది కూడా వాళ్లేనని ఫైరయ్యారు. అలా జరిగితే పూర్తి బాధ్యత కేసీఆరే దేనని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ గెలుపుతో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతామని బండి సంజయ్ చెప్పారు. ఇప్పటికే జాతీయ నాయకత్వం తెలంగాణపై ఫోకస్ పెట్టిందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో రేపు ఎన్నికలు ఉన్నాయన్నా తాము సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి బూత్, మండల, జిల్లా స్థాయి అధ్యక్షులు కూడా లేరని ఎద్దేవా చేశారు. కానీ తాము బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అంతా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. యూపీ ఎన్నికల్లో వెళ్లి దాదాపు 25 రోజులకు పైగా కష్టపడిన తెలంగాణ మహిళా మోర్చా నేతలను బండి సంజయ్ అభినందనలు తెలిపారు.

యూపీ బుల్డోజర్లు తెలంగాణకు..

తెలంగాణకు.. ఉత్తరప్రదేశ్ కు చెందిన బుల్డోజర్లు వస్తున్నాయని, బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయని, త్వరలో వారిని ఇక్కడ దించుతామని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలనను ఆ బుల్డోజర్లతో తొక్కిచ్చేస్తామని ఆయన హెచ్చరించారు. డబ్బుల సంపాదన కోసమే దేశవ్యాప్తంగా ఎంఐఎం పోటీచేస్తోందని రాజాసింగ్ చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. యోగీ నాయకత్వాన్ని యూపీ ప్రజలు సమర్థించారన్నారు. ఎన్నికలు జరిగిన అన్ని చోట్లా కార్యకర్తలు తీవ్రంగా కష్టపడ్డారన్నారు. ఇది పార్టీ విజయం కాదని, ప్రజల విజయమని తెలిపారు.

ఇది కేవలం నాలుగు రాష్ట్రాల్లోని గెలుపుతో ఆగిపోదని, తెలంగాణలో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. యూపీలో గుండా రాజ్యాన్ని దించి యోగి సర్కార్ గద్దె ఎక్కినట్లు.. తెలంగాణలో కూడా గుండా రాజ్యాన్ని గద్దె దింపుతామని హెచ్చరించారు. టీఆర్ఎస్ నేతలు తీవ్ర అవినీతికి పాల్పడుతున్నారని, బాలికలను లైంగికంగా వేధిస్తున్నారనన్నారు. ఎంఐఎంపై బుల్డోజర్ ను ఎక్కించి తొక్కిస్తామని హెచ్చరించారు.

తెలంగాణలో పాగా వేస్తాం

రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ పాగా వేస్తామని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ లో యోగి గ్యాంగ్ స్టార్లను తొక్కేశారని, వారికి చెందిన రూ.2 వేల కోట్ల ఆస్తులను జప్తు చేశారన్నారు. అందుకే భారీ విజయాన్ని అందుకున్నారన్నారు. కుటుంబ రహిత పాలన వల్లే విజయం సాధ్యమైందన్నారు. ప్రధాని మోడీ అందించే రేషన్ తో పాటు యోగి అదనంగా 5 కేజీల బియ్యం అందించారని పేర్కొన్నారు. 15 కోట్ల యూపీ ప్రజలకు రేషన్ అందుతోందన్నారు. తెలంగాణ లో ఇప్పటి వరకు పూర్తిస్థాయిగా రుణమాఫీ చేయలేదని తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలోని 62 లక్షల మందికి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఏడాదికి రూ.6 వేలు అందిస్తున్నట్లు చెప్పారు. యూపీలో కోటి మంది విద్యార్థులకు మొబైల్స్, ట్యాబులు అందించిన ఘనత బీజేపీదేనని తెలిపారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని, కాంగ్రెస్ జమానాలో కూడా అంతా అవినీతేనని విమర్శలు చేశారు. ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవని, అది ఏ పార్టీకి సాధ్యంకాలేదని హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో యోగి రికార్డు కొట్టాడన్నారు.

తెలంగాణలో కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేస్తే పిల్లలు పుట్టాక కూడా రావడం లేదని మండిపడ్డారు. మరో 20 ఏండ్ల వరకు మోడీ సర్కారుకు ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. ఇది తాము చెప్పడంలేదని, కేసీఆర్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోరే చెబుతున్నాడని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ మాజీ అధ్యక్షుడు ఎన్ ఇంద్రసేనారెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, యువ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్, గీతామూర్తి, రాష్ట్ర నాయకులు సీహెచ్.విఠల్, గూడూరు నారాయణరెడ్డి, జె.సంగప్ప, ఆకుల విజయ, డాక్టర్ పద్మ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed