ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల కోసం ఆథర్ ఎనర్జీ కీలక ఒప్పందం!

by Disha Web Desk 17 |
ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల కోసం ఆథర్ ఎనర్జీ కీలక ఒప్పందం!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఆథర్ ఎనర్జీ స్కూటర్లకు అవసరమైన కీలక విడిభాగాల తయారీ, అభివృద్ధి కోసం కీలక భాగస్వామ్యం చేసుకున్నట్టు బుధవారం వెల్లడించింది. ప్రముఖ ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూపునకు చెందిన భారత్ ఎఫ్ఐహెచ్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. దీని ద్వారా మెరుగైన డిమాండ్ ఉన్న ఆథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) ఆథర్ 450 ఎక్స్, 450 ప్లస్ స్కూటర్ల తయారీని మరింత పెంచేందుకు వీలవుతుందని కంపెనీ అభిప్రాయపడింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా భారత్ ఎఫ్ఐహెచ్ సంస్థ బ్యాటరీ సంబంధిత వ్యవస్థ, డ్యాష్‌బోర్డ్ అసెంబ్లీ, కంట్రోలింగ్ యూనిట్లు, డ్రైవ్ కంట్రోల్ మాడ్యూల్స్ కోసం కావాల్సిన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్‌ల తయారీ సేవలను అందిస్తుంది.

ఈవీ పరిశ్రమలో రోజురోజుకు గిరాకీ భారీగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా తమ స్కూటర్లను విస్తరించడానికి ఈ భాగస్వామ్యం ద్వారా విడిభాగాల కొరత లేకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని ఆథర్ ఎనర్జీ సహ-వ్యవస్థాపకుడు, సీఈవో తరుణ్ మెహతా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఒప్పందం తర్వాత స్కూటర్ల సరఫరాలో సమస్యలు ఉండవని, అంతేకాకుండా తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు, డెలివరీలను వీలైనంత త్వరగా పూర్తి చేసి వినియోగదారులకు స్కూటర్లను అందజేయడానికి భారత్ ఎఫ్ఐహెచ్ భాగస్వామ్యం దోహదపడుతుందని ఆయన వివరించారు. తమ ఎలక్ట్రానిక్స్ తయారీ సేవలు, టెక్నాలజీని ఆథర్ ఎనర్జీకి అందించడం ద్వారా సంస్థ విస్తరణకు అవకాశం లభించిందని భారత్ ఎఫ్ఐహెచ్ ఎండీ జోష్ ఫౌల్గర్ అన్నారు.



Next Story

Most Viewed