ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ సంస్థలపై అమెజాన్ తీవ్రమైన ఆరోపణలు!

by Disha Web Desk 12 |
ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ సంస్థలపై అమెజాన్ తీవ్రమైన ఆరోపణలు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ రిటైల్ దిగ్గజం ఫ్యూచర్ రిటైల్‌కు చెందిన స్టోర్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. తమ అభ్యంతరాలకు పరిష్కారం చూపకుండా ముందుకెళ్లేందుకు ఒప్పుకోమని పబ్లిక్ నోటీసులను విడుదల చేసింది. ఫ్యూచర్ రిటైల్, దాని ప్రమోటర్లు మోసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, దీనివల్ల న్యాయపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెజాన్ స్పష్టం చేసింది. ఫ్యూచర్ రిటైల్, లాజిస్టిక్ వ్యాపారాలను రిలయన్స్ సంస్థకు ఫ్యూచర్ గ్రూప్ రూ. 24,713 కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఫ్యూచర్ గ్రూపులో అమెజాన్ మైనర్ వాటాదారుగా పెట్టుబడులు పెట్టింది.

అయితే, రిలయన్స్‌తో ఒప్పందంపై తమ నిర్ణయాలను పట్టించుకోలేదని, తమ అభిప్రాయాలను తీసుకోకుండా ఎలా విక్రయిస్తారని అమెజాన్ కోర్టుకెళ్లింది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. ఈ క్రమంలోనే ఫ్యూచర్ సంస్థ అధీనంలో ఉన్న దేశంలోని రిటైల్ స్టోర్లను రిలయన్స్ సంస్థ స్వాధీనం చేసుకుంది. ఫ్యూచర్ గ్రూప్ స్టోర్లను రీబ్రాండింగ్ కూడా చేయనున్నట్టు సమాచారం. ఫ్యూచర్ గ్రూప్ సంస్థ స్టోర్ల లీజుదార్లకు చెల్లింపులు చేయకపోవడంతో, రిలయన్స్ వారితో కొత్తగా లీజుకు ఒప్పందం చేసుకుంది. అనంతరం ఆ స్టోర్లను ఫ్యూచర్ గ్రూపునకే సబ్-లీజుకు ఇచ్చి, మళ్లీ వాటిని రద్దు చేసి రిలయన్స్ సంస్థే దేశంలోని మొత్తం 947 స్టోర్లను స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారంపైనే అమెజాన్ సంస్థ అన్ని పత్రికల్లో పబ్లిక్ నోటీసులతో ప్రకటనను జారీ చేసింది. ఈ అంశంలో ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ సంస్థలు చట్ట విరుద్ధంగా ముందుకెళుతున్నాయని ఆరోపణలు చేసింది.



Next Story

Most Viewed