రాములోరి కళ్యాణం వేళ భద్రాచలంలో దీక్షలు.. ఎందుకంటే..?

by Disha Web Desk 13 |
రాములోరి కళ్యాణం వేళ భద్రాచలంలో దీక్షలు.. ఎందుకంటే..?
X

దిశ, భద్రాచలం: శ్రీరామనవమికి వచ్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు భద్రాచలం సమస్యల పరిష్కారానికి నిర్దిష్టమైన ప్రకటన చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన 'అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం' డిమాండ్ చేసింది. సీపీఎం పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు, ప్రజా, సామాజిక సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో తీవ్రంగా నష్టపోయిన భద్రాచలాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నదని అన్నారు.


శ్రీరామనవమికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నందున.. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా ప్రతినిధులు ఎవరు వచ్చినా భద్రాచలం రాముని రాజకీయం చేయకుండా పట్టణ అభివృద్ధికి, పరిష్కరించాల్సిన సమస్యల గురించి నిర్దిష్టమైన ప్రకటన చేయాలని అఖిలపక్షం కోరింది. ముఖ్యంగా 2014లో ఒక్క కలంపోటుతో ద్వారా భద్రాచలం భవిష్యత్తును అంధకారంలో నెట్టిన బీజేపీ ప్రజా ప్రతినిధులు, అమిత్ షా కీలక ప్రకటన చేయాలని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.100 కోట్ల నిధులు హామీ అమలు గురించి ప్రకటించాలని అన్నారు.

ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పోలవరం ముంపుకు గురైన సమయంలో కేంద్రం నిధులు కేటాయించి భద్రాచలం ముంపునకు గురికాకుండా పటిష్ట చర్యలు ఎలా తీసుకుంటారో ప్రజలకు వివరించాలని, పాండురంగాపురం నుంచి భద్రాచలం వరకు రైల్వే లైను నిర్మాణం చేయాలని, పట్టణానికి ఆనుకుని ఉన్న ఐదు పంచాయతీలను కలిపే ఆర్డినెన్స్ తేవాలని అఖిలపక్షం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్షం గా ఐక్య కార్యాచరణ ప్రకటించారు. ఏప్రిల్ l5న ప్రెస్ మీట్ నిర్వహించాలని 6, 7 తేదీల్లో దీక్షలు చేపట్టాలని శ్రీరామనవమికి వచ్చిన నేతలకు వినతిపత్రం అందించాలని కార్యాచరణ ప్రకటించారు.


ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భద్రాచలం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మచ్ఛా వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అరికెళ్ళ తిరుపతిరావు, టీడీపీ నాయకులు కుంచాల రాజారాం, పట్టణ ప్రముఖులు ఐటీసీ పేపర్ బోర్డ్ కాంట్రాక్టర్ పాకాల దుర్గాప్రసాద్, టీఎన్జీవోస్ జిల్లా నాయకులు చల్లగుల్ల నాగేశ్వరరావు, మహాజన సోషలిస్టు పార్టీ నాయకులు అలవాల రాజా, బహుజన సమాజ్ పార్టీ నాయకులు నాగరాజు, గిరిజన సంఘం నాయకులు ఎస్. కోటేశ్వరరావు, సీఐటీయూ పట్టణ కన్వీనర్ వెంకటరామారావు, మహిళా సంఘం నాయకులు డి. లక్ష్మి, యు. జ్యోతి, లీలావతి, కుసుమ, జీవనజ్యోతి, రమణ రాధా, డీవైఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Next Story