టీ-కాంగ్రెస్‌లో వేట మొదలైంది.. నెక్ట్స్ జాబితాలోనూ సీనియర్లు!

by Disha Web Desk 2 |
టీ-కాంగ్రెస్‌లో వేట మొదలైంది.. నెక్ట్స్ జాబితాలోనూ సీనియర్లు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సొంత పార్టీలో చిచ్చు పెట్టుతున్న నేతలపై వేటు మొదలైంది. టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డిని పదేపదే విమర్శిస్తూ, రాజీనామా చేస్తానంటూ చెప్పుకొస్తున్న జగ్గారెడ్డికి పార్టీ పదవులన్నీ కట్ చేశారు. అధిష్టానం నిర్ణయం మేరకు టీపీసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో అధిష్ఠానానికి లేఖ రాసి తాను స్వతంత్రంగా ఉంటానని చెప్పిన నేపథ్యంలో అదే లేఖను అదునుగా తీసుకుని ఆయనకు షాక్‌ ఇచ్చారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఇచ్చిన అదనపు బాధ్యతల నుంచి జగ్గారెడ్డిని తొలగిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్‌ నియోజకవర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి జగ్గారెడ్డిని తప్పించింది. జగ్గారెడ్డి బాధ్యతలను మిగతా వర్కింగ్‌ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. అంజన్‌ కుమార్‌, అజారుద్దీన్‌, మహేష్‌ గౌడ్‌లకు రేవంత్‌ రెడ్డి ఈ బాధ్యతలను అప్పగించారు. తాజాగా కాంగ్రెస్​ పార్టీలో కొత్త చర్చ మొదలైంది. ఏఐసీసీ ఆదేశాలతోనే పలు నిర్ణయాలు తీసుకుంటున్న టీపీసీసీ.. రాష్ట్రంలో వ్యవహారాలన్నింటిపైనా నివేదికను సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ నివేదిక ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​ మాణిక్కం ఠాగూర్‌కు అందించింది.

ఇంకా ఎవరెవరు?

హస్తం పార్టీలోని అసంతృప్తివాదులతో ఆదివారం మాజీ ఎంపీ వీ.హనుమంతరావు సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి చాలా మందిని ఆహ్వానించినా.. జగ్గారెడ్డి, మర్రి శశిధర్​రెడ్డి మినహా నేతలెవ్వరూ పాల్గొనలేదు. ఈ పరిణామాల్లో జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో సవాల్​విసిరారు. మరోవైపు చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరిగింది. కొంతమంది కేసీఆర్​ కోవర్టులు అంటూ కూడా కాంగ్రెస్‌లో అనుమానాలున్నాయి. అంతేకాకుండా టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డికి వ్యతిరేకంగా ఒక వర్గం పని చేస్తుందనే విమర్శలున్నాయి. దీంతో పార్టీలో అంతర్గత విభేదాలు పలుమార్లు బయటకు వస్తూనే ఉన్నాయి. రేవంత్​రెడ్డి తీసుకుంటున్న కార్యక్రమాలను విభేదిస్తున్న నేపథ్యంలో పలువురు నేతలపై అనుమానాలు బలపడ్డాయి. అయితే, ఇప్పటి వరకు ఈ నేతలపై ఏఐసీసీ సైలెంట్‌గా వ్యవహరించింది. గతంలో ఓసారి ఏఐసీసీ జనరల్​సెక్రెటరీ కేసీ వేణుగోపాల్​సమీక్షించి, నాయకులకు పలు సూచనలిచ్చి పంపించారు. అయినా ఏదో ఓ సందర్భంలో వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా జగ్గారెడ్డిపై ఒక విధంగా వేటు పడటంతో.. పార్టీలో ఇంకా ఎవరిపై చర్యలు తీసుకుంటారనే సందిగ్ధత మొదలైంది. మరోవైపు సీఎల్పీ నేత భట్టితో సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, సీనియర్​ నేతలు దామోదర రాజనర్సింహా, మధుయాష్కీ, పొన్నం, జానారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి వంటి వారు కూడా అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రగతిభవన్​మీటింగ్‌కు వెళ్లిన నేతలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరందరికీ మరోసారి హెచ్చరికలు జారీ అవుతాయని పార్టీ వర్గాలు చెప్పుతున్నాయి. ఏఐసీసీ నుంచి వార్నింగ్​వచ్చినా పద్ధతి మార్చుకోకుంటే వేటేస్తారంటున్నారు.

ఢిల్లీకి వద్దు

ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీలు రేవంత్, వెంకట్​రెడ్డి, ఉత్తమ్​ఢిల్లీలోనే ఉన్నారు. ఆయా సందర్భంలో ఏఐసీసీ పెద్దలను కలుస్తూనే ఉన్నారు. అయితే, మంగళవారం వీహెచ్ ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ, ప్రస్తుతం రాష్ట్ర పార్టీ నేతలు ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదంటూ ఏఐసీసీ నుంచి సమాచారమిచ్చారు. ఫిర్యాదులు చేసేందుకే ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్న నేతలకు బ్రేక్​వేశారు. దేశవ్యాప్తంగా రాహుల్​గాంధీ యాత్ర చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, దానికి సంబంధించిన సమావేశాలు నిర్వహిస్తున్నామని, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై రావద్దంటూ ఆదేశించారు.

అసంతృప్తులకు షోకాజ్

రాష్ట్రంలో ఆదివారం హోటల్ అశోకాలో సీనియర్ల భేటీపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. ఇప్పటికే చర్యలకు ఆదేశించింది. జగ్గారెడ్డి ప్రస్తుతం వర్కింగ్​ప్రెసిడెంట్‌గా ఉన్నట్టా.. లేదా అనేది ప్రశ్నార్థకంలోనే పడింది. ఆయనకు కేటాయించిన బాధ్యతలన్నీ తొలగించారు. అంతేకాకుండా మరికొంతమంది సీనియర్లపైనా చర్యలు తీసుకునేందుకు అధిష్టానం రంగం సిద్ధం చేస్తోంది. రెండ్రోజుల్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. అసంతృప్తి వేదికగా సమావేశం నిర్వహించిన సీనియర్లకు షోకాజ్ నోటీస్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా మీడియాలో బహిరంగ సవాళ్లు చేయడంపైనా ఏఐసీసీ ఆగ్రహంగా ఉంది.

మంత్రితో ఎందుకు కలిసినట్టు!

కాగా రేవంత్‌ను వ్యతిరేకిస్తూ సమావేశం నిర్వహించిన మాజీ ఎంపీ వీ.హనుమంతరావు.. అంతకు ముందే మరో అడుగు ముందుకేశారు. మంత్రి హరీష్‌రావుతో వీహెచ్ భేటీ అయ్యారు. మంత్రితో భేటీ తర్వాతే అసంతృప్తి నేతల సమావేశం ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ పెద్దలు ఆరా తీస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా సమావేశాన్ని నిర్వహించడమే కాకుండా.. మంత్రి హరీశ్​రావుతో సమావేశం కావడంపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు రెండ్రోజుల్లో ఏఐసీసీ కార్యదర్శి బోస్‌రాజు రాష్ట్రానికి వెళ్లాలని ఏఐసీసీ సూచించింది. బోస్‌రాజు వచ్చే వరకు షోకాజ్ నోటీస్ ఇస్తారా.. లేదా అనేది పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.



Next Story

Most Viewed