ప్రతి అర్ధరాత్రి.. ఢిల్లీ రోడ్లపై 10 కి.మీ పరుగెడుతున్న యువకుడు

by Disha Web Desk 12 |
ప్రతి అర్ధరాత్రి.. ఢిల్లీ రోడ్లపై 10 కి.మీ పరుగెడుతున్న యువకుడు
X

దిశ, ఫీచర్స్ : అర్ధరాత్రి వేళ నోయిడా రోడ్డుపై పరుగెడుతున్న ఓ యువకుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫిల్మ్ మేకర్ వినోద్ కప్రీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన సదరు వీడియో ఇప్పటికే 4 మిలియన్‌కు పైగా వ్యూస్ సంపాదించింది. ఇక చాలా దూరం ఆగకుండా పరుగెత్తడం వల్ల ఆ యువకుడి శరీరమంతా చెమటతో తడిసి పోయినప్పటికీ.. వినోద్ ఇచ్చిన లిఫ్ట్ ఆఫర్‌ను తిరస్కరించాడు. దీంతో అతని పరుగు వెనకున్న కారణం తెలుసుకునే ప్రయత్నం చేసిన వినోద్.. అతని కథ విని ఆశ్చర్యపోయాడు.

ఉత్తరాఖండ్‌కు చెందిన 19 ఏళ్ల ప్రదీప్ మెహ్రాకు ఇండియన్ ఆర్మీలో చేరాలన్నది కల. అర్ధరాత్రి వరకు మెక్‌డొనాల్డ్స్ సంస్థలో పనిచేసే తను.. ఇంటికెళ్లే సమయాన్ని రన్నింగ్ ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకుంటున్నాడు. ఈ మేరకు ప్రతి రోజు నోయిడాలోని సెక్టార్ 16 లోని తన ఆఫీస్ నుంచి బరోలాలోని తన ఇంటికి 10 కిలోమీటర్లు పరుగెత్తుతున్నాడు. అక్కడ తన సోదరునితో కలిసి ఉంటున్న ప్రదీప్.. అర్ధరాత్రి దాటాక ఇంటికి చేరి, మళ్లీ ఉదయమే లేచి వంట చేసుకుని జాబ్‌‌కు రావాల్సి ఉంటుంది. దీంతో మార్నింగ్ ప్రాక్టీస్‌ చేసే టైమ్ దొరక్క ఇలా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు చెప్పాడు. పైగా అతని తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిపాడు.

#PradeepMehra 20 సెకన్ల స్ప్రింట్ వీడియోను సోమవారం ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు మిస్టర్ కప్రీ. నెటిజన్లలో స్ఫూర్తి నింపుతున్న ఈ వీడియో సింగర్-రాపర్ బాద్షా దృష్టిని కూడా ఆకర్షించగా.. 'మన దేశ భవిష్యత్తు అద్భుతమైన వ్యక్తుల చేతుల్లో ఉంది. ఈ అబ్బాయిని ఆశీర్వదించండి' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇక వీడియోకు విపరీతమైన స్పందన లభించి నేపథ్యంలో ఫిల్మ్ మేకర్ వినోద్ మరోసారి మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌కు వెళ్లి ప్రదీప్‌ను కలిశాడు. తనపై నెటిజన్లు ఎంత ప్రేమ కురిపిస్తున్నారో వివరించాడు.

Next Story

Most Viewed